తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమూ చాలా కష్టమే అయ్యింది. ఆపై ఇప్పుడు నెగ్గుకు రావడానికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఒకరకంగా సీఎం రేవంత్ రెడ్డి అభిమన్యుడు మాదిరిగా పద్మవ్యూహంలో ఉన్నారు. ఛేదించి బయటకు రావడమనేది అంత సులువు కాదు. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్‌ను కేసీఆర్‌ను మట్టి కరిపించడమే అంటే సాధారణ విజయం కాదు. కానీ ఆ పనిని రేవంత్ ప్రణాళికాబద్దంగా పూర్తి చేశారు. ఆపై ముఖ్యమంత్రి పదవికి పోటీ ఏమీ తక్కువగా లేదు. ఎందరో సీనియర్లు.. వారందరినీ ఎదుర్కొని చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్టించారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఇదంతా ట్రైలరే.. ఇక ముందుంది అసలు సినిమా.
దుస్సాహసమైతే చేయదనుకున్నా..
రేవంత్ ప్రభుత్వం ఏర్పడటానికి 60 మంది ఎమ్మెల్యేల బలం అవసరమైంది. అయితే 64 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని స్థాపించింది. అంటే ఒక ఐదుగురు ఇటు నుంచి అటు జంప్ చేశారే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకరకంగా రేవంత్ పక్కలో బల్లెం ఉన్నట్టే. సరే.. ఇప్పటి వరకైతే బీఆర్ఎస్ అలాంటి దుస్సాహసమైతే చేయదు అనుకున్నా లేదంటే రేవంతే కొందరు ఎమ్మెల్యేలను ఆ గట్టు నుంచి ఈ గట్టుకు లాగినా కూడా ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ ఆరు గ్యారెంటీల రూపంలో మరో సమస్య పొంచి ఉంది. ఇప్పటికే విపక్షాలు డేగ కళ్లేసుకుని చూస్తున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా వదలడం లేదు.
అవి ఎప్పుడు మార్చాలి?
ఆరు గ్యారెంటీల అమలు నిజానికి తలకు మించిన భారమే. పైగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించేశారు. సమయం చూస్తే పెద్దగా లేదు. ప్రహసనమైతే మొదలు పెట్టారు కానీ అన్నింటికీ రేషన్ కార్డుతో లింక్ పెట్టారు. తెల్ల రేషన్ కార్డుదారులు దరఖాస్తు చేసుకోమని చెబుతూనే వాటి జారీకి సంబంధించి నియమ నిబంధనలు మారుస్తు్నామని చెప్పారు. అవి ఎప్పుడు మార్చాలి? వీటికి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి. అనర్హులు లక్షల్లో తెల్ల రేషన్ కార్డులు మంజూరయ్యాయట. ఈ క్రమంలోనే అసలైన అర్హులు నష్టపోయారని కాబట్టి వాటిపై అధ్యయనం చేయాల్సి ఉంది కాబట్టి రేషన్ కార్డుల మంజూరుకు సమయం పడుతుందన్నారు. దీంతో ఆరు గ్యారెంటీల పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకున్నాయి.