సృష్టిలో పెంపుడు జంతువులన్నింటికీ ఒక్కో ధర ఉంది. పాలిచ్చే గేదె నుంచి మనం పెంచుకునే మేక.. కుక్క వరకూ ప్రతి ఒక్క దానికి ఒక రేటు ఉంది. మనిషికి ఓటుకూ ఓ రేటు ఉంది. అయితే గేదె.. కుక్క.. మన ఓటు విషయానికి వస్తే.. మన రేంజ్ కొన్ని రెట్లు తక్కువ. అంత హీనమా.. మనం? మన ఓటు విలువ మరీ అంతా? ఐదేళ్లు మనల్ని పాలించే వారిని రూ.500కు అమ్ముడుపోయి తెచ్చుకుంటే.. మనకు ఏ సమస్య వచ్చినా ఎవరిని అడుగుతాం? మనమెళ్లి ధైర్యంగా వారికి మన సమస్య చెప్పుకోగలమా?
కొనుక్కున్న వాడు ఊరికే ఉంటాడా?
ఐదేళ్ల అధికారాన్ని మనం ఐదు వందలకో.. వెయ్యికో అమ్ముకుంటే.. ఆ కొనుక్కున్న వాడు ఊరికే ఉంటాడా? తాను ఎన్నికల కోసం పెట్టిన ఖర్చుకు వెయ్యి రెట్లు లాగుతాడు. అదేమని అడగ్గలమా? అందుకే ఓటు వేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మన ఆయుధం ఓటు. దానిని ఒక్కసారి మారిస్తే కంటికి కూడా కనిపించని రూ.500 కోసం అమ్ముకోకండి. ఇప్పుడు వాట్సాప్‌లో.. సోషల్ మీడియాలో చాలా సందేశాలు వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్క విషయం మనకు తెలుసు. ఇప్పుడు చదువుకున్న వారిలో అయితే పూర్తిగా మార్పొచ్చింది కానీ నిరక్షరాస్యుల్లో ఇంకా మార్పు రావాల్సి ఉంది.
మన విలువైన ఓటును అమ్మేసుకుందామా?
సోషల్ మీడియా వారిలో మార్పు తెచ్చేందుకు బాగానే ప్రయత్నిస్తోంది. కానీ ఎంత మేర సఫలం అవుతుందనేది చెప్పడం కష్టం. మద్యం, మాంసం.. ఒకరోజు తింటే అయిపోతుంది. డబ్బు ఖర్చు పెట్టనంత వరకే మనది. మరి ఇలాంటి వాటి కోసం మన విలువైన ఓటును అమ్మేసుకుందామా? ఇలా ఓటును అమ్ముకోవడం వలన మన అభివృద్ధిని మనమే కోల్పోయినట్టు అవుతుంది. మనం నిజాయితీగా లేకుంటే.. నాయకులు ఎలా నిజాయితీగా ఉంటారు? ఓటును అమ్ముకోవడం అంటే మన నాశనానికి మనమే బాటను వేసుకోవడం.. మన అభివృద్ధికి మనమే గండి కొట్టుకోవడం. ఓటేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి వ్యక్తికి ఓటేయండి.