తెలుగు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది ఒక ప్రశ్న అయితే.. బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ లేదంటే బీజేపీ కానీ ఎన్నికైతే ఆయా పార్టీల నుంచి సీఎం ఎవరు అవుతారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే రెండు పార్టీల్లోనూ లెక్కకు మించిన నేతలు ఉన్నారు. నిజానికి నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి రచ్చ నిత్యం జరుగుతూ ఉండేది. ఈ పార్టీలో సీనియర్లంతా తామే సీఎం అంటూ ఊదరగొట్టేవారు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలహీనమవడానికి ఇది కూడా ఒక కారణం. కాగా.. ఇప్పుడు ఈ రచ్చ బీజేపీలోనూ మొదలైంది. తెలంగాణలో బీజేపీ అధికార పార్టీకి పోటీనిచ్చే రేంజ్‌కి ఎదిగిందంటే దానికి కారణం బండి సంజయ్.
కుండబద్దలు కొట్టేసిన ఈటల..
అలాంటి బండి సంజయ్ మొదలు.. ఒకరిద్దరు బీసీ నేతలు తామే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా ప్రధాని మోదీ తెలంగాణకు ఒక బీసీ సీఎం అవుతారంటూ ప్రకటించినప్పటి నుంచి బీసీ నేతలంతా యాక్టివ్ అయిపోయారు. తానే కాబోయే సీఎం అంటూ తెగ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇదంతా సీక్రెట్‌గానే జరిగేది. కానీ తాజాగా ఒక నేత మాత్రం బహిరంగ ప్రచారానికి తెరదీశారు. ఆయన మరెవరో కాదు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్. బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం తానే ముఖ్యమంత్రినని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టేశారు. అసలు ఈ విషయాన్ని ప్రధాని మోదీయే తనకు స్వయంగా చెప్పారనడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆయన్ను కూడా సీఎంను చేసేశారు..
ఇటీవల ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సభలోప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సభలో ఈటల కూడా పాల్గొన్నారు. సభ అనంతరం.. 30 మంది బీసీ నేతల సమక్షంగా తాను కాబోయే ముఖ్యమంత్రినని చెప్పారని ఈటల తెలిపారు. ప్రధాని అంతటి వ్యక్తి మాటిస్తే తాను ముఖ్యమంత్రిని కాకుండా ఎలా పోతానని ప్రశ్నించారు. ఇక బండి సంజయ్ సైతం ఆయన అనుచరులు ఇప్పటికే సీఎంను చేసేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా సీఎం.. సీఎం అంటూ నినాదాలతో హెరెత్తిస్తున్నారు. అంతేకాకుండా బండి సంజయే సీఎం అంటూ ఫ్లెక్సీలు సైతం కడుతున్నారు. ఇక వీరిద్దరే కాదు మరో ఇద్దరు బీసీ నేతలు సైతం సీఎం పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఆలు లేదు చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగమని.. తెలంగాణలో బీజేపీ గెలిచేదెంతో ఏమో కానీ సీఎం కుర్చీ కోసం నేతలు తెగ కుస్తీ పడుతున్నారు.