అవును.. తెలంగాణ ప్రజల నాడి ఎవరికీ అర్థం కావట్లేదు. మునుపెన్నడూ లేని విధంగా పరిస్థితులు మారిపోయాయ్! రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఓటరు ఎటువైపు ఉన్నాడనేది తెలియట్లేదు. ఓ వైపు అభ్యర్థులను ప్రకటించంతో పాటు.. బీఫామ్‌లు ఇచ్చేసి.. మేనిఫెస్టోను ప్రకటించేసి జనాల్లోకి పంపించారు గులాబీ బాస్ కేసీఆర్. మరోవైపు.. ఇంకా అభ్యర్థులను ప్రకటించడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ముహూర్తాల కోసం వేచి చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒపినీయల్ పోల్స్ కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. ఈ సర్వేల్లో ఒకటి బీఆర్ఎస్.. ఇంకొన్ని సంస్థలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ విజయడంఖా మోగించబోతోందని బల్లగుద్ధి చెబుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలన్నీ కాంగ్రెస్‌దే హవానే అని తేల్చేశాయి. అయితే.. ఇప్పటి వరకూ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా పూర్తిగా రాకపోవడం గమనార్హం. హస్తం పరిస్థితి ఇలా ఉంటే సదరు సర్వే సంస్థలు ఎలా అంచనా వేశాయన్నది ఎవరికీ తెలియట్లేదు. పార్టీని చూసి సర్వే చేసినప్పటికీ అభ్యర్థి కూడా అంతకంటే ముఖ్యమన్నది తెలిసిన విషయమే కదా.
తలలు పట్టుకుంటున్నారు!
శనివారం ఒక్కరోజే.. ఇండియా టుడే- సీ ఓటర్, ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ చేసిన సర్వేలు వచ్చాయి. ఈ రెండూ ప్రముఖ సర్వే సంస్థలే. దేన్ని తప్పుబట్టడానికి లేదు. ఇండియా టుడే సర్వే ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకి 54 సీట్లు, బీఆర్‌ఎస్‌కు 49 సీట్లు, బీజేపీకి కేవలం 08 సీట్లు వస్తాయని తేల్చింది. ఇక ఓట్ల శాతం విషయానికొస్తే.. కాంగ్రెస్ 39 శాతం, బీఆర్‌ఎస్ 38 శాతం వస్తుందని సర్వేలో తేలింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలన్న తెలంగాణలో మేజిక్ ఫిగర్-60. దీని ప్రకారం చూస్తే.. కాంగ్రెస్‌దే హవా. ఇక.. ఇండియా టీవీ సర్వే ప్రకారం.. బీఆర్ఎస్‌కు 70 స్థానాలు, కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 07 స్థానాలు, ఎంఐఎంకు 07, ఇతరులు ఒకే ఒక్క స్థానంలో మాత్రమే గెలుస్తారని తేల్చింది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్-88, కాంగ్రెస్-19, ఎంఐఎం-07, ఇతరులు-04 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన చూస్తే.. కాంగ్రెస్‌కు వచ్చే సీట్ల సంఖ్య డబుల్ అవ్వగా.. బీఆర్ఎస్ మాత్రం 18 స్థానాలకు పడిపోయింది. ఒక సర్వేతో బీఆర్ఎస్ ఆనందంలో మునిగి తేలిపోగా.. మరో సర్వే డీలా పడిపోయింది. ఇక కాంగ్రెస్ శ్రేణులు అయితే ‘మనల్ని ఎవడ్రా ఆపేది.. అధికారంలోకి వచ్చేశాం’ అనేంతలా ఫీలవుతున్నాయ్. మరో సర్వేతో మరీ పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా అని కంగారుపడుతున్నారట. మొత్తానికి చూస్తే.. ఈ రెండు సర్వేలతో అటు బీఆర్ఎస్.. ఇటు కాంగ్రెస్ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్.. ఏం చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది.
ఎప్పుడూ ఇలా లేదే..!
వాస్తవానికి ఇప్పటి వరకూ జరిగిన 2014, 2018 ఎన్నికల్లో దాదాపు ఒపినీయల్ పోల్స్ అన్నీ అక్షరాలా నిజమయ్యాయి. ఆఖరికి లగడపాటి రాజగోపాల్ సర్వేతో ‘కారు’ కే రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. అయితే ఈసారి ఎందుకో ఎటూ తేలట్లేదు. జనాలు ఎటు వైపు ఉన్నారు.. ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే.. ఎక్కడ చూసినా మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది.. ఎటు చూసినా ప్రభుత్వ వైఫల్యాలే కనిపిస్తున్నాయే కానీ.. బీఆర్ఎస్‌కు ఓటేయమని మాత్రం చెప్పట్లేదు. ఇక కాంగ్రెస్, కమలం పార్టీ పరిస్థితి ఇందుకు భిన్నం.. ఢిల్లీ పెద్దలకు పెత్తనమిస్తే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది..? తెలంగాణను ఏం చేస్తారోనని బెరుకు సైతం ప్రజల్లో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మునుపెన్నడూ లేని పరిస్థితి తెలంగాణలో ఇప్పుడు ఉందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్య నేతల చేరికలు, రోజురోజూ బలపడటం, సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్‌తో కచ్చితంగా అధికారం హస్తందేనని.. ఇక డిసెంబర్-03 గెలిచేసి.. వారం రోజుల్లో ప్రమాణ స్వీకారమే తరువాయి అన్నట్లుగా సీన్ క్రియేట్ చేస్తోంది. అబ్బే.. కాంగ్రెస్, బీజేపీవి ఎప్పుడూ చెప్పే మాటలే.. అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే.. వందకు వెయ్యి శాతం వచ్చేశాం.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం కన్ఫామ్ అని గులాబీ దళం చెప్పుకుంటోంది.. ఏం జరుగుతుందో చూద్దాం మరి.