టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టులో రెండో రోజు విచారణ ప్రారంభమైంది. నేటితో చంద్రబాబు రిమాండ్ ముగియనుంది. దీంతో కోర్టు ఏం తీర్పు వెలువరిస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. స్కిల్ కేసుపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు... చంద్రబాబు తరపున లాయర్ ప్రమోద్ దూబే వాదనలు వినిపిస్తున్నారు.
చంద్రబాబు తరపున లాయర్ ప్రమోద్ దూబే వాదనలు..
‘‘స్కిల్ కేసులో చంద్రబాబుకు సంబంధం లేదు. 2 ఏళ్ల తర్వాత రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారు. డిజైన్ టెక్ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబు సీఎం హోదాలో స్కిల్ స్కీమ్‌కు.. నిధులు మాత్రమే మంజూరు చేశారు. ఒప్పందం ప్రకారం 40 సెంటర్లు ఏర్పాటు చేశారు. అంతా ఓపెన్‌గా జరిగితే ఇందులో స్కామ్ ఎక్కడుంది? చంద్రబాబు పాత్ర ఏముంది? ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఇప్పటికే కస్టడీలో చంద్రబాబు అధికారులకు సహకరించారు. ఇక కస్టడీ కూడా అవసరం లేదు... అయినా విచారణ సాగదీయడానికే పిటిషన్ వేశారు. బెయిల్ మంజూరు చేయాలి’’ అని దూబే వాదనలు వినిపించారు.
ఏపీ ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు వాదనలు..
ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయి. కేబినెట్ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదు. ఒప్పందంలో తప్పిదాలకు చంద్రబాబే బాధ్యులు. బ్యాంక్ లావాదేవీలపై విచారించాల్సి ఉంది. చంద్రబాబును కస్టడీకి తీసుకుని.. మరిన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది.
కాగా.. స్కిల్ కేసుపై ఏసీబీ కోర్టు వాదనలకు విరామం ప్రకటించింది. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. విచారణకు ఏసీబీ కోర్టు లంచ్ బ్రేక్ ఇచ్చింది. తిరిగి మ.2:30 గంటలకు విచారణ ప్రారంభం కానుంది.