ఎన్నికలు వస్తున్నాయంటే వరాల జల్లు కురిపించడం పార్టీలకు అలవాటే. అవి ఎంతవరూ అమలు చేస్తారనేది ఆ తరువాతి విషయం. ఈ వరాల జల్లు ప్రకటించడంలో ప్రధాని మోదీ ముందుంటారు. అటు ఏపీ, ఇటు తెలంగాణపై వరాల జల్లు కురిపించడం సర్వసాధారణమై పోయింది. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. పాడిందే పాటరా అన్నట్టుగా ఒక్కపాటే అందుకుంటారు. 2015లో ఏపీలో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపనకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఏదో సాయం చేస్తారని రాష్ట్రమంతా ఆశిస్తే గుప్పెడు మట్టితో సరిపెట్టారు. ఇక ఆ తరువాత 2019 ఎన్నికలకు ముందు విశాఖకు రైల్వేజోన్ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క అడుగూ ముందుకు పడింది లేదు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. పసుపు బోర్డు. ఎన్నికలు వచ్చినప్పుడు=ల్లా తెలంగాణలో పసుపు బోర్డు గురించి బీజేపీ వాగ్దానాలు చేస్తూనే ఉంటుంది. తాజాగా అయితే ఇప్పటివరకు రైల్వేజోన్ ఏర్పాటుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్ సభలో ప్రకటించారు. రెడ్డొచ్చే మొదలాయె అన్నట్టుగా.. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఈ కామన్ హామీ ఏంటిరా బాబోయ్ అని జనాలు తలలు పట్టుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఏపీలో రైల్వే జోన్ మాదిరిగానే తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు ఉంటుందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ మాటను నమ్మితే అంతే సంగతులు అంటూ హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో మంచి స్థానంలో ఉన్న బీజేపీని చేజేతులా అధిష్టానమే నాశనం చేసింది.
ఇప్పుడు వచ్చి ఇచ్చిన హామీనే ఇస్తోంది. ప్రధాని మోదీ అయితే తెలంగాణ పొలిటిక్స్‌పై ఫోకస్ పెట్టినట్టు అయితే తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోమారు పసుపు బోర్డు ప్రకటన. దీని వెనుక ఉన్న కథేంటంటే.. 2019 ఎన్నికల సమయంలో చాలా మంది రైతులు పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవగా.. అప్పటి నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తాను గెలిస్తే పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ రాసిచ్చి మరీ ప్రచారం చేశారు. ఆ తరువాత ఆయన ఎంపీగా విజయం సాధించారు. కానీ పసుపు బోర్డు ఊసే మరిచారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పసుపు పంటే ప్రధానం. కాబట్టి ఒక పసుపు బోర్డు ఉంటే తమ పంటకు మద్దతు ధర లభిస్తుందనేది రైతుల ఆశ. ఇలా బీజేపీ వాగ్దానాలు ఇచ్చినప్పుడల్లా ఆనందపడటం.. ఆ తరువాత మోసపోవడం జరుగుతూ వస్తోంది.