తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. రానున్న రోజులు పార్టీలన్నింటికీ మరింత కీలకం కానున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాలుగు స్థానాలు మినహా అభ్యర్థులను ప్రకటించేసింది. అయితే అభ్యర్థుల జాబితా నుంచి ఒకరు ఇప్పటికే కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. ఇకపోతే.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనైతే ప్రకటించలేదు కానీ మినీ మేనిఫెస్టో, గ్యారంటీ స్కీములతో జనాలను ఆకట్టుకునే పనిలో పడింది. బీజేపీది మరో దారి. అసలు లోలోపల లొసగులను తొలగించడం మానేసి అధిష్టానాన్ిన తీసుకొచ్చి రాష్ట్రంపై వరాల జల్లు కురిపిస్తోంది. ఏం చేసినా తెలంగాణ జనం బీజేపీని అయితే పక్కన పడేశారు. కేవలం బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే పోరు నడుస్తోంది.
అన్ డిసైడెడ్ ఓట్లపై ఫోకస్..
తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీ దిమ్మతిరిగే న్యూస్ ఒకటి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని 25 సీట్లు దాటనివ్వబోమని.. దీనికోసం అత్యంత కీలకమైన మేనిఫెస్టోను బయట పెట్టనున్నట్టు తెలిపారు. నిజానికి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోనే కీలక పాత్ర పోషించింది. ఈసారి తెలంగాణలోనూ రామబాణం లాంటి ఆయుధాలతో మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెబుతోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి వెన్నులో వణుకు మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని అనుసరిస్తూనే సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రకటిస్తోంది. పైగా తెలంగాణ ఉన్న అన్ డిసైడెడ్ ఓట్లపై ఫోకస్ పెడుతున్నట్టు రేవంత్ నేరుగానే తెలిపారు. 19 శాతమున్న ఈ ఓట్లన్నీ తమకేనని స్పష్టం కూడా చేశారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే ఈ సారి అధికారాన్ని దక్కించుకునే విషయంలో చాలా సీరియస్‌గా ఉందనే విషయం రేవంత్ మాటల్ని బట్టి అర్థమవుతోంది.
వారిని ప్రసన్నం చేసుకుంటే చాలు..
బీఆర్ఎస్ పార్టీకి ఏ ఏ వర్గాలైతే వ్యతిరేకంగా ఉన్నాయో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. బీసీ ఆశావహుల కోసం తాను పీసీసీ చీఫ్‌గా కొట్లాడుతానని రేవంత్ వెల్లడించారు. అలాగే బీసీలకు బీఆర్ఎస్ ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువగా ఇస్తామని ప్రకటించి మెజారిటీ వర్గమైన బీసీలను రేవంత్ ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మొత్తానికి టీజర్, ట్రైలర్ అంటూ టోటల్‌గా బీఆర్ఎస్‌కు సినిమా చూపించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్టీసీ మినహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులంతా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు అంతా వ్యతిరేకంగా ఉన్నారు. మరోవైపు సొంత పార్టీ వారికి తప్ప గృహలక్ష్మి పథకంలోకి వేరొకరిని తీసుకోవడం లేదంటూ మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. వీరందరినీ ప్రసన్నం చేసుకోగలిగితే చాలు అధికారం పక్కాగా కాంగ్రెస్ పార్టీదే అవుతుందనడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అయ్యిందో అక్కడ నుంచి కాంగ్రెస్ నరుక్కొస్తోంది. ఇక చూడాలి సీఎం కేసీఆర్ ఎలాంటి వ్యూహాలకు పదును పెడతారో..