ఏపీలో టీడీపీ - జనసేన పొత్తు ఫిక్స్. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించారు. ఈ సమయంలోనే బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందనే ఆశాభావం పవన్ వ్యక్తపరిచారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ బీజేపీ అధిష్టానం ఆయనను ఇప్పటి వరకూ పిలిచి మాట్లాడింది లేదు. నిజానికి చంద్రబాబుపై కేసు విషయంలో వైసీపీకే బీజేపీ అధిష్టానం ఫేవర్‌గా ఉన్నట్టు జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. మరి ఈ తరుణంలో పవన్ ఏం స్టెప్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో నిన్న పవన్ చేపట్టిన వారాహి యాత్ర నాలుగో విడత కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రారంభమైంది.
ఇక్కడ జరిగిన సభలో పవన్ దాదాపు బీజేపీ జోలికి వెళ్లలేదు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్టే అనిపించింది. నిన్నటి యాత్రను బట్టి చూస్తే మాత్రం బీజేపీని పవన్ చాలా తేలిగ్గా తీసుకున్నట్టు క్లియర్‌గా అర్థమవుతోంది. అసలు వాస్తవానికి వస్తే.. టీడీపీ - జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చి చేరడం వల్ల ఈ రెండు పార్టీలకు నష్టం చేకూరుతుందని స్పష్టం. నిజానికి ఏపీలో బీజేపీకి ఏమాత్రం సీన్ లేదు. పైగా క్రిస్టియన్లు, ముస్లింలను దూరం చేసుకున్నట్టే అవుతుంది. కూటమి వల్ల కేవలం బీజేపీ లబ్ది పొందుతుంది. జనసేన-టీడీపీ ఓట్లు బీజేపీకి బదిలీ అవుతాయి. బీజేపీకి ఏపీలో ఓటు బలం లేదు కాబట్టి టీడీపీ - జనసేనకు ఏమాత్రం లబ్ది చేకూరే అవకాశం లేదు.
ఏ పార్టీ అయినా బీజేపీతో పొత్తు అంటే ముందుగా ఆలోచించే అంశం ఒక్కటే. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి తమకు ఉపయోగపడుతుందనే ఒకే ఒక్క ధీమా.కేంద్రంతో సఖ్యతగా ఉండటం ఏ పార్టీకైనా అవసరం. ఈ విషయం ఆలోచించే వైసీపీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముఖ్యంగా ఏపీలో అయితే నష్టమే తప్ప లాభం ఏమీ లేదు. ఈ క్రమంలోనే పవన్ తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. కేంద్రంతో సఖ్యత సెకండరీ. ముందు ఇంట గెలవాలనే యోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే బీజేపీని పక్కనబెట్టినట్టు సమాచారం.అందుకే బీజేపీతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే పొత్తును పవన్ ప్రకటించేశారు. మొత్తానికి బీజేపీ తమతో రాకుంటేనే బెటర్ అనే యోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.