రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో పంథాలో వెళ్తుంటారు.. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఎక్కడలేని నినాదాలతో జనాల్లోకి వెళ్తుంటారు..! అంతకుమించి ఎన్నికల హామీలు ఇస్తూ ముందుకెళ్తుంటారు.. ఫైనల్‌గా కావాల్సింది గెలుపు..! ఇప్పటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీ, అభివృద్ధి అని నినదించగా.. సీఎం వైఎస్ జగన్ రెడ్డి మాత్రం ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని నినాదంతో హోరెత్తించారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ‘నేను మాటిస్తున్నా.. మాట నిలబడతా’ అని సరికొత్త నినాదంతో జనాల్లోకి వచ్చేశారు. ఆదివారం నాడు అవనిగడ్డలో జరిగిన వారాహి యాత్ర నాలుగో విడతలో భాగంగా సేనాని మాట్లాడుతూ ఇలా నినాదం ఎత్తారు. పవన్ సుమారు 40 నిమిషాలకుపైగా ప్రసంగం చేయగా.. జగన్.. జగన్.. జగన్ అంటూ కనీసం లేదంటే వందసార్లు ప్రస్తావన తెచ్చి ఉంటారు. ఇక అధికారపార్టీ వైసీపీపై విమర్శలు అయితే లెక్కే లేదు. ఇక టీడీపీ-జనసేన పొత్తు గురించి కూడా మాట్లాడి తెలుగు తమ్ముళ్లు, కార్యకర్తలను ఉత్తేజపరిచారు. పవన్ మాట్లాడుతున్నంతసేపు సీఎం.. సీఎం అంటూ నినాదాలతో కార్యకర్తలు, వీరాభిమానులు హోరెత్తించారు.
దేనికైనా రెఢీ జగన్..!
‘వైసీపీ హయాంలో జరిగిన తప్పుల గురించి చదివి.. చదవి గడ్డం నెరిసిపోతోంది. నేను అసెంబ్లీలో ఉండి ఉంటే రైతుల కోసం ప్రశ్నించేవాడ్ని. ఏపీలో రైతులకోసం నా సొంత డబ్బులు కౌలు రైతులకి ఇచ్చాను. జనసేన- తెలుగుదేశం పొత్తుకు రైతులు అండగా నిలబడాలి. నేను మాట ఇస్తున్నాను.. మాట ఇస్తే నిలబడతాను. మీకు సమస్య ఉంటే నాకు చెప్పుకొని, అవకాశం ఉంటే పనిచేసే విధంగా తోడుగా ఉంటాను. పదేళ్లు నన్ను చూశారు నేను ఎక్కడికి పారిపోలేదు. ఇంత స్టార్ డమ్ ఉండి, గెలవలేని ఓటమిని తీసుకున్నాను.. నిలబడ్డాను. జగన్ దగ్గరికి వెళ్లి నమస్కారం.. నా పేరు పవన్ కల్యాణ్ అని కూర్చుంటే సంతోషపడేవాడు. కానీ నేను అలా చేయను.. నా సినిమాలు ఆపుతావో ఆపేయ్.. ఏం చేస్తావో చేసుకో. వాలంటీర్ల వ్యాఖ్యలపై కేసులు పెడతారట.. సంతోషంగా పెట్టుకో జగన్. ఇప్పటిదాక రాజకీయనాయకుల్ని చూసి ఉంటావ్. దేశభక్తి కలిగిన వారితో రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. అసెంబ్లీలో నేనొక్కడి చాలు, వైసీపీ వాళ్లను ఆపడానికి’ అని పవన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే.. జగన్‌పై దేనికైనా రెఢీ అని సేనాని చెప్పకనే చెప్పేశారన్న మాట.
లాజికల్‌గా ప్రసంగం..!
వాస్తవానికి.. పవన్ మునుపటి ప్రసంగాలతో పోలిస్తే టీడీపీ-జనసేన పొత్తుల తర్వాత పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. పొత్తుల ప్రకటన తర్వాత మీడియా మీట్‌లు, కార్యకర్తలు-నేతల సమావేశాలకే పరిమితమైన పవన్.. మొదటిసారి వారాహియాత్రలో భాగంగా మాట్లాడిన మాటలతో పంథా మొత్తం మారిపోయిందని చెప్పుకోవచ్చు. జగన్ ప్రభుత్వం తీరును ఎండగట్టడం, డీఎస్సీ ఆశావహులు.. నిరుద్యోగులకు హామీలివ్వడం, పొత్తుల గురించి పార్టీ కార్యకర్తలకు అర్థమయ్యేలా చెప్పడం.. అసలు టీడీపీ-జనసేన గెలుపు ఎంత ఆవశ్యకం ఉంది..? ఇలా ప్రతి విషయంపైనా పవన్ మాట్లాడుతూ వచ్చారు. మరీ ముఖ్యంగా..‘ వైసీపీ గుర్తు ఫ్యాన్.. ఎవ్వరికీ అందదు.. ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లులు పేలిపోతాయ్. ఏపీ అభివృద్ధిని.. నిరుద్యోగులను వైసీపీ ఫ్యాన్‌కు ఉరేశారు.. దాహం తీర్చే గ్లాసు.. ఓ చోటు నుంచి మరో చోటుకు చేర్చే సైకిల్ కలిశాయి’ అని పవన్ చెప్పిన లాజికల్ ప్రసంగానికి టీడీపీ, జనసేన కార్యకర్తలు.. నేతలు ఫిదా అయిపోయారు. మొత్తానికి చూస్తే.. పొత్తు తర్వాత పవన్ ప్రసంగం అదరగొట్టేశారు.. ఇక వైసీపీ నుంచి విమర్శలు.. టీడీపీ నుంచి సపోర్టు ఏ మాత్రం ఉంటుందనేది చూడాలి మరి.