ఏదైనా విషయంలో కోర్టులో కేసులు నడుస్తున్నప్పుడు దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయమూ తీసుకోవడానికి ఎవరూ సాహసించరు. కానీ ఏపీ సీఎం జగన్ రూటే సెపరేటు. పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని అంటూ ఏపీకి మూడు రాజధానులను అంటగట్టి ఉన్న రాజధానిని ఉసూరుమనిపించారు. ఇప్పుడు దసరా నుంచి విశాఖ నుంచే పరిపాలన అంటూ చిలక పలుకులు పలుకుతున్నారు. తన మకాంను కూడా దసరా నాటికి సాగర తీరానికి మార్చనున్నారు. అంతేకాదు.. ఈ నెల 23న విశాఖ కొత్త ఇంటి గృహ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ చేసేశారు.
అంత సింపులా..?
అంతా బాగానే ఉంది కానీ కోర్టుల మాటేంటి? వాటితో మాకేం పని అంటారా? లేదంటే కోర్టులు మా ఇంటి కోడెదూడలు అంటారా? విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సాక్షిగా త్వరలో విశాఖకు మకాం మారుస్తానని, అక్కడి నుంచి పరిపాలన సాగిస్తానని హామీ ఇచ్చేశారు. హామీయే కదా.. ఇలాంటి హామీలివ్వడం జగన్‌కు సర్వసాధారణం అనుకుంటే.. అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా మొదలు పెట్టేశారు. తాము అడ్గంగా తవ్విన విశాఖ రుషికొండపైనే సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మొత్తానికి విజయదశమికి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేసేస్తున్నారు. విశాఖ నుంచి పాలన అంటే అంత సింపులా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
పనులు పూర్తయ్యేదిప్పుడు..?
జగన్ పెట్టుకున్న టార్గెట్‌కు కేవలం మూడు వారాలే గడువు. ఈలోపు ఇంటి కోసం శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారట. ఇంటీరియర్ పనులు పూర్తికావొస్తున్నాయట. ఇక ల్యాండ్ స్కేపింగ్ పనులు కూడా ఫినిషింగ్ స్టేజ్‌లో ఉన్నాయట. ఇక కేవలం కాంపౌండ్ వాల్‌కే రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నారట. జగన్ ఇల్లా మజాకా? బ్యూటిఫికేషన్ కోసం రూ.4 కోట్లట. ఇక ఈ ఇల్లు ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఇక క్యాంప్ ఆఫీసు కూడా ఓకే. మరి అధికార యంత్రాంగం? దానిని కూడా సిద్ధం చేసేస్తున్నారట. ప్రముఖ నిర్మాణ కంపెనీ డీఈసీ ఆధ్వర్యంలో అత్యంత వేగంగా, నాణ్యతతో పనులు చేయిస్తున్నారట. అక్టోబర్ 15 నాటికి ముఖ్యమంత్రి ఇంటి పనులు పూర్తి చేసి సెక్యూరిటీ విభాగానికి అప్పగించాల్సి ఉంది.