కుగ్రామాల్లోని పిల్లలు.. కనీసం సొంతంగా పట్నానికి వెళ్లి అక్కడివారితో మాట్లాడేందుకు సైతం ధైర్యం చాలని బిడియం. పదిమంది పెద్దల ముందు నిలబడి తమ అభిప్రాయాలు చెప్పలేని అమాయకత్వం.. కానీ రోజులు మారాయి.. కొండకోనల్లో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే పిల్లలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికల మీదకు ఆశీనులయ్యారు. పెద్ద పెద్ద ప్రొఫెసర్ల ఎదుట ఏమాత్రం సంశయం లేకుండా ప్రసంగిస్తున్నారు. తమ స్కూళ్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో వాళ్ళే గర్వంగా ప్రచారం చేస్తున్నారు. తమ విద్యావిధానం ఎంత గొప్పగా మారిందో వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లుగా మారి దేశవిదేశాల్లో ప్రచారం చేస్తున్నారు.
తమకోసం ..తమ వికాసం కోసం తమ ప్రభుత్వం ఎంతగా శ్రద్ధ పెడుతుందో ఆ పిల్లలే స్వయంగా చెబుతుంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్లు నోరెళ్ళబెట్టి వినాల్సిన రోజులు వచ్చాయి. అబ్బో.. ప్రభుత్వ స్కూళ్లు ఇంత గొప్పగా ఉన్నాయా ? అయితే అన్ని దేశాలు.. అందరు పాలకులు ఇలాగే చేయాలి.. విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అని విద్యావేత్తలు.. శాస్త్రవేత్తలు..మేధావులు.. ప్రొఫెసర్లు ఏక కంఠంతో అంగీకరించాల్సి వచ్చింది.
మనబడి నాడు - నేడు కు విశ్వవ్యాప్త గుర్తింపు*
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యారంగ సంస్కరణలు, మారిన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విద్యార్థులకు ట్యాబ్ లు, జగనన్న విద్యాకానుక ద్వారా బ్యాగులు, పుస్తకాలు, డిక్షనరీ, బెల్టు, బూట్లుతోపాటు గోరుముద్ద ద్వారా పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ . వంటివి ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేకంగా చర్చకు వచ్చాయి.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సుస్థిర -అభివృద్ధికి సంబంధించి ఉన్నత స్థాయి రాజకీయ సదస్సు (హై లెవెల్ పొలిటికల్ ఫోరం) న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో నిర్వహించగా ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు హాజరై స్టాల్ పెట్టి మన ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో గణనీయమైన పురోగతి సాధించడంపై కెనడా స్కూళ్లు, కాలేజీల సోషల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు ముఖ్య అధికారి జూడీ ప్రశంసలు కురిపించారు.ఇంకా విద్యారంగంలో బాలికలు సాధించిన . ప్రగతిని క్యాలిఫోర్నియా విద్యాశాఖ ప్రతినిధి షెరిల్ అభినందించారన్నారు.
ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు జరిగే ప్రత్యేక సదస్సుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 10 మంది విద్యార్థులను అమెరికా తీసుకెళ్లారు. వీరు అక్కడి వేదికల మీద ప్రముఖుల సమక్షంలో చేసిన ప్రసంగాలు.. తమ ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న కృషిని ఆనందం.. తన్మయత్వంతో కూడిన సంతోషంతో వివరిస్తూ ఉంటే మేధావులు సైతం మంత్ర ముగ్ధులయ్యారు.
ఏపి విధానాలు భేష్ : ప్రో. జెఫ్రీ సాచ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకోసం ఇస్తున్న ప్రాధాన్యం, దాన్ని అమలు చేస్తున్న తీరు, పిల్లలు సైతం ఆ సౌకర్యాలను అందిపుచ్చుకుని ఉన్నత ప్రమాణాలను ఆకళింపు చేసుకుంటున్న తీరు అభినందనీయం అని ప్రఖ్యాత కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్ అన్నారు.ఈ సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్ మన విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యావిధానంలో వచ్చిన మార్పులను పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు తాము ఏ విధంగా ఈ స్థాయికి చేరుకున్నదీ,తమకు ప్రభుత్వం ఎంతగా తోడ్పాటును ఇస్తున్నదీ
వివరిస్తూ ఉంటే ఆయన అమితానందం పొందారు. 42 గౌరవ డాక్టరేట్లు పొందిన ఈ ప్రొఫెసర్ పిల్లల పరిణితి చూసి ముచ్చట పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలు పాలకులకు మార్గదర్శకం అవుతున్నాయని కొనియాడారు.
ఐరాసలో సదస్సులో అదరగొట్టిన విద్యార్థులు !!
సమాజ మనుగడకు యువత..యువ శక్తే కీలకం. అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చేసిన ప్రసంగం దేశదేశాల అధినేతలు. మంత్రులు..అధికారులను ఆకట్టుకుంది. న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు పై జరిగిన సదస్సులో విద్యార్థులు మాట్లాడుతూ సమాజాభివృద్ధికి యువత ఎంత కీలకం అన్నది వివరిస్తూ చెబుతుంటే ఆహూతులు మంత్ర ముగ్ధులయ్యారు. సాధారణ ప్రభుత్వ స్కూళ్ల పిల్లల్లో ఇంత పరిణితి, స్థాయి ఆలోచనా స్థాయి ప్రోదిగొల్పడానికి అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణం అని అందరూ
అంగీకరించాల్సిన పరిస్థితి మన పిల్లలు కల్పించారు. మొత్తానికి ఏపి లో విద్యారంగం సాధించిన ప్రగతి ఇప్పుడు దేశవిదేశాల కు ప్రాకింది.. ఇది..కదా పాలన అని అందరూ అభినందించాల్సింది.