నంద్యాలలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును నేటి తెల్లవారుజామున సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ వార్తల నేపథ్యంలో గత అర్థరాత్రి నుంచి నంద్యాలలో హైడ్రామా చోటు చేసుకుంది. చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. నంద్యాలను పూర్తిగా పోలీసులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ముందుగా చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా చంద్రబాబును విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్టు చేయడం, ఆరోపణలకు ఆధారాలు చూపకపోవడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆధారాలు చూపిస్తే చట్టానికి సహకరిస్తానని చంద్రబాబు చెప్పారు. ముందుగా ప్రాథమిక సాక్ష్యం చూపాలని అడిగారు. అయితే అన్నీ ఇస్తాం అంటూ విచారణ అధికారులు మాట దాటవేశారు. ఆపై చంద్రబాబు ను అరెస్టు చేస్తున్నట్లు వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబు లాయర్లపై కూడా డీఐజీ రఘురామరెడ్డి దురుసుగా ప్రవర్తించారు. అడ్వకేట్లకు అవగాహన లేదంటూ ఫైర్ అయ్యారు. అయితే రాత్రి 1 గంటకు రావాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. తాను తప్పు చేస్తే నడిరోడ్డులో ఉరి తీయాలంటూ సవాల్ విసిరారు. అసలు ఏ చట్ట ప్రకారం తనను అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. కనీసం చంద్రబాబును ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకపోవడం గమనార్హం.
ఇక చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్రం మొత్తం రావణకాష్టంలా మారింది. ఎక్కడిక్కడ టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేసినా కూడా కేడర్ పెద్ద మొత్తంలో బయటకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఎక్కడికక్కడ తెలుగు తమ్ముళ్ల నిరసనలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద వేకువజామునే పోలీసులు మోహరించారు. నాయకులను ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. కొన్ని చోట్ల టీడీపీ నేతల ఇంటి గేటుకి పోలీసులు తాళాలు వేయడం గమనార్హం. మరోవైపు అటు గన్నవరం.. ఇటు కాకినాడలలో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చంద్రబాబుతో పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.