జీవితా రాజశేఖర్ చేరని పార్టీ ఏదైనా వుందా? అంటే అది ఎంఐఎం అని చెప్పాలేమో. సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా ప్రాభవం తగ్గిన జీవితా రాజశేఖర్‌లు సినిమాల్లో యాక్టీవ్‌గా లేకపోయినా రాజకీయాల్లో..రాజకీయపార్టీలు మారడంలో మాత్రం యమ యాక్టీవ్‌గా వున్నారు. తాజాగా ఈ జంట మళ్లీ పార్టీ మారారండోయ్. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వున్న సమయంలో కాంగ్రెస్లో చేరి హంగామా చేసిన ఈ జంట ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలు, చిరంజీవి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం వంటి పరిణమాల మధ్య నారా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అక్కడితో వీరి పార్టీ మార్పు ప్రక్రియ ఆగలేదు. అక్కడ వీరికి అంత ప్రాధాన్యం దక్కలేదు. దీంతో ఇక్కడ వుంటే లాభః లేదని నిర్ణయించుకుని అక్కడి నుంచి బీజేపీలోకి జంపయ్యారు. హత విధీ ఎంటీ వీరి జంపింగ్‌లని పలువురు సినీ ప్రముఖులు ముక్కున వేలేసుకున్నారు కూడా.
ఇంతగా తమ గురంచి నవ్వుకుంటున్నా పట్టించుకోని ఈ జంట మళ్లీ పార్టీ మారారు. గత కొంత కాలంగా సైలెంట్‌గా వుంటూ రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్న ఈ జంట `మా` ఎన్నికలతో మళ్ళీ రంగంలోకి దిగింది. ఏపీలో రాజకీయం వేడెక్కుతున్న వేళ తాము పార్టీ మారడానికి ఇదే సరైన తరుణమని భావించారో ఏమోగానీ వైసీపీలోకి జంపైపోయారు. ఈ మధ్య మూకుమ్మడిగా సినీ తారలంతా వైసీపీకి జైకొడుతూ ఆ పార్టీలో చేరిపోతున్న విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని జారవిడుచుకోవడం ఇష్టంలేని జీవితారాజశేఖర్ సోమవారం ఉదయం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో వైసీపీ కండువాకప్పుకుని పార్టీలో చేరిపోవడం ఆసక్తికరంగా మారింది. వీరి గురించి తెలిసిన వారు మాత్రం ఆ ఈ పార్టీలోను ఎంత కాలం వుంటారులే మళ్లీ తెరాసలోనే లేక జనసేనలోనో చేరిపోరూ అని పెదవి విరుస్తున్నారు.