కింజవరపు ఎర్రంనాయుడుకి రాజకీయాలలో ప్రత్యేకస్థానం ఉంది. ఆయన చంద్రబాబుకి నాడు కుడిభుజంగా అన్ని వ్యవహారాలు చూసుకునేవారు. ముఖ్యంగా ఢిల్లీలో ఆయన బాబుకి నమ్మినబంటులా ఉండేవాడు. ఆయన హఠాన్మరణం తర్వాత ఆయన తనయుడు కింజారపు రామ్మోహన్‌నాయుడు రాజకీయాలలోకి వచ్చారు. మొదట్లో అందరు ఆయన తండ్రి మరణం వల్ల ఏర్పడిన సానుభూతి వల్ల టిక్కెట్ సంపాదించాడని, ఈయన కూడా వారసుడిగా తప్పితే ఏమీ లేదని భావించారు. కానీ ఈ యువనాయకుడు లోక్‌సభలో ఇటీవల మోదీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసతీర్మానం సందర్బంగా అదరగొట్టి ప్రశంసలు చూరగొన్నాడు. ఆరోజున కేవలం సభ మొత్తం హిందీలో అనర్ఘళంగా మాట్లాడి, కేంద్రాన్ని ప్రశ్నించినరామ్మోహన్‌నాయుడు, ఇంగ్లీషులో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని నిలదీసిన గల్లాజయదేవ్‌లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారంటే అతిశయోక్తికాదు. ఈయన కేవలం ఎంపీ కావడం వల్ల, లోక్‌సభలో మెజార్టీ సభ్యులైన హిందీ రాష్ట్ర ఎంపీలకు అర్ధమయ్యేలా మాట్లాడటం కోసం హిందీ భాష నేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాడట.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. నాకు క్రికెట్, బాస్కెట్‌బాల్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడైతే ఎంత ఎండల్లో అయినా సరే క్రికెట్ అంటే సరి.. ఆడటానికి వెళ్లిపోయేవాడిని. కానీ ఇప్పుడు సమయం దొరకడం లేదు. ఇక సినీ నటుల్లో నాకు బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్, టాలీవుడ్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌లంటే ఇష్టం. వీరిద్దరి నటన ఎంతో గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటునిగా ఎదిగిన విధానం, ఆయన నటనలోని హావభావాలు అద్భుతమని చెప్పాడు. ఇక తనకు డ్యాన్‌బ్రౌన్ నవలలంటే ఎంతో ఇష్టమని, భారతదేశంలో అయితే హిమాలయ ప్రాంతాలు, విదేశాలలో అయితే న్యూయార్క్ సిటీలు తనకెంతో ఇష్టమైన ప్రదేశాలని చెప్పుకొచ్చాడు. నిజంగానే ఈ యువకుడి పట్టుదల చూసి మిగిలిన వారుసులు కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది...!