ఏపీ నుండి రాజ్యసభకు ఓ సీటును బిజెపి ఇవ్వడంతో దానికి ప్రతిఫలంగా కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా టిడిపికి ఒక కేంద్రమంత్రి పదవి లేదా గవర్నర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని సమాచారం. కానీ టిడిపి మాత్రం తమకు మంత్రి పదవితో పాటు ఒక గవర్నర్ పదవి కూడా ఇవ్వాలని కోరుకుంటోంది. కానీ బిజెపి మాత్రం ఈ రెండింటిలో ఒకటి మాత్రమే ఇస్తామని, ఏది కావాలో తేల్చుకోమని చెబుతున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు తెలంగాణ నేత మోత్కుపల్లి నరసింహులుకు గవర్నర్ పదవి ఇస్తామని ఎప్పుడో వాగ్దానం చేసింది. మరోపక్క గవర్నర్ పదవి కోసం ఏపీ నుండి యనమల రామకృష్ణుడు లైన్లో ఉన్నాడు.
ఇక టిడిపి కేంద్రమంత్రి పదవి తీసుకోవాలని భావిస్తే... అందుకు ఏపీ నుండి తీవ్ర పోటీ ఎదురుకానుంది. పలువురు సీనియర్లతో పాటు ఇటీవలే లోకేష్‌బాబు అండతో రాజ్యసభ సీటు దక్కించుకున్న టి.జి.వెంకటేష్ కూడా కేంద్రమంత్రి పదవికి పోటీ పడుతున్నారు. లోకేష్ అండదండలతో మంత్రి పదవిని కూడా చేజిక్కించుకోవాలని ఆయన భావిస్తున్నాడట. మరోవైపు చంద్రబాబుకు నమ్మినబంటు, వరంగల్ నుండి అంటే తెలంగాణ నుండి రాజ్యసభ సీటును పొందిన గరికపాటి రామ్మోహన్‌రావు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో బాగా బలహీన పడిన టిడిపి గరికపాటికి మంత్రిగా అవకాశం ఇస్తే అది తెలంగాణలోని కార్యకర్తలకు, ఇతర పార్టీ శ్రేణులకు మంచిఊపు నిస్తుందని చంద్రబాబు సన్నిహితులు అంటున్నారు. అయినా ఏపీకి దక్కాల్సిన మంత్రి పదవిని తెలంగాణకు ఇవ్వడానికి వీలులేదని, ఆంధ్రా నుండి ఇంత పోటీ ఉన్నప్పుడు పోయి పోయి తెలంగాణకు మంత్రి పదవి ఎలా ఇస్తారని? ఏపీ పార్టీ శ్రేణులు అంటున్నాయి.