నెల్లూరు పెద్దారెడ్డి తెలిసిన వారికి నెల్లూరు పెద్ద నాయుడు గారు కూడా బాగానే తెలుసు. ఆయన మరెవ్వరో కాదు.. వెంకయ్యనాయుడు. ఈయన మాటల మాంత్రికుడు, తన ఉపన్యాసాలతో తిమ్మిని బమ్మిని చేయగల ఘటనా ఘట సమర్దుడు. కాగా వెంకయ్యకు బయటే కాదు.. సొంత నెల్లూరులో కూడా ప్రజాబలం ఏమీ లేదు. అందుకే ఆయనకు ప్రత్యక్ష ఎన్నికల కంటే పరోక్ష ఎన్నికలు చాలా ఇష్టం. శ్రమ లేని పని అది. అందుకే ఆయన ఎప్పుడూ రాజ్యసభకు వెళ్లడానికే మొగ్గుచూపుతుంటాడు. కాంగ్రెస్‌లో చిదంబరం, జైరాం రమేష్‌ల లాగానే ఈయన కూడా తనకంటే తెలివైన వాడు ఎవ్వరూ లేరనే నమ్మకం ఎక్కువ. భాజాపా పార్టీలో ఎవరికి ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయంటే క్షణాల్లో వారికి భజన పరుడిగా మారిపోతాడు. దాంతో ఆయనకు పార్టీ అధ్యక్షపదవితో పాటు బిజెపి ప్రభుత్వంలో కూడా పదవులు వరిస్తూనే ఉంటాయి. వాజ్‌పేయ్‌కి, అద్వానీకి నిన్న మొన్నటివరకు కొమ్ముకాసిన ఆయన మోడీ ప్రదాని అయ్యే అవకాశం ఉందని తెలిసి ఆయన పంచన చేరి మంచి మంత్రి పదవినే చేపట్టాడు. కాగా ఈయన గారి రాజ్యసభ ఎంపీ పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. ఆయన ఇప్పటివరకు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నాడు. కానీ ఈసారి కర్ణాటక బెర్త్ దొరకడం ఆయనకు వీలయ్యే పనికాదు. అక్కడ రెండు రాజ్యసభ సీట్లను కాంగ్రెస్ గెలిపించుకోనుంది. బిజెపికి ఒక్క సీటు దక్కనుంది. మరో స్దానం కోసం కాంగ్రెస్, బిజెపీలు పోటీ పడుతున్నాయి. బిజెపికి కరెక్ట్‌గా వచ్చే ఒక్క సీటును ఆ పార్టీ రాష్ట్ర కొత్త చీఫ్ బియస్ యడ్యూరప్పకు అత్యంత సన్నిహితుడైన ఎ. మంజునాధకు ఇవ్వడం ఖాయమై పోయిది. సో.. ఈసారి ఆయనకు కర్ణాటకపై నమ్మకాలు లేవు. దాంతో ఆయన చూపు ఏపీపై , మరీ ముఖ్యంగా చంద్రబాబుపపై పడింది. ఈసారి ఆయన ఏపీ నుండి రాజ్యసభకు వెళ్లాలని భావిస్తున్నాడు. ఇంతకాలం ఏపీకి తానే దిక్కు.. ఢిల్లీ నుండి ఏపీకి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక శుభవార్తతో, ఏదో ఒక ప్రాజెక్ట్‌తో వస్తున్నానని చెబుతున్న వెంకయ్యనాయుడు అంటే ప్రస్తుతం ఏపీప్రజానీయం ఆగ్రహంగా ఉంది. ఆనాడు సమైఖ్య ఏవీ విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు కాదు... పదేళ్లు ప్రత్యేకహోదా కావాలని పట్టుబట్టి ఆయన ఆంద్రుల మనసును దోచుకున్నాడు. అదే వెంకయ్య ఇప్పుడు ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదంటున్నాడు. ఈ పరిణామం టిడిపి నాయకులనే కాదు.. ఏపీ ప్రజలల్లో కూడా అగ్గిని రాజేస్తోంది. వాస్తవానికి ఎన్ని విబేధాలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడులకు మాంచి అనుబంధమే ఉంది. గతంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కోసం ఒక స్ధానాన్ని టిడిపి త్యాగం చేసింది. ఇప్పుడు వెంకయ్య కోసం మరో సీటును టిడిపి త్యాగం చేయడానికి సిద్దపడినా ఏపీ ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తం కావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే కొంతకాలం నుండి వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి అని, గవర్నర్ పదవి అని వార్తలు వస్తున్నాయి. మరి బిజెపీ అగ్రనాయకత్వం నెల్లూరు నాయుడు గారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి......!