ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ రాజ్యసభ సాక్షిగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ చౌదరి స్పష్టం చేయడంతో ఇక ఏపీకి ప్రత్యేక హోదాపై ఆశలులేవని స్పష్టంగా అర్ధమవుతోంది. అయితే ఈ ప్రకటన చూసి ఏపీ ప్రజలలైతే నోరు వెళ్లబెట్టలేదు. బిజెపికి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం లేదని ఎప్పటినుండో అర్ధమవుతోంది. కానీ రాజ్యసభ సాక్షిగా కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయడం ఇప్పుడు కీలకంగా మారింది. ప్రత్యేక హోదా కోసం ఆంద్ర ప్రజలు మరో ఉద్యమానికి సిద్దంగా ఉండాలని కొందరు సూచిస్తున్నారు. అవసరమోస్తే ప్రశ్నిస్తాను అంటూ వచ్చి నిన్నటి ఎన్నికల్లో బిజెపికి, టిడిపికి అనుకూలంగా ఓటు వేచించిన పవన్ కూడా ఉద్యమంలోకి దూకాలని, లేకపోతే పవన్ మాటలను ఇక ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరని, ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేసినా ఈ ఎఫెక్ట్ ఆయనపై పెద్ద ప్రభావానే చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్ననే ఈ విషయమై పవన్‌కళ్యాణ్ ప్రజలను ఉద్దేశిస్తూ రెండు ట్వీట్స్ చేశాడు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం సీమాంద్ర ఎంపీలను తన్ని పార్లమెంట్‌లోంచి బయటికి గెంటి ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ పార్టీ ఓ ఘోరమైన తప్పు చేసింది. ఆరోజు సీమాంద్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరూ మర్చిపోలేదు. మరిచిపోరు కూడా.. ఈరోజు ప్రత్యేకహోదా విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గితే సీమంద్ర ప్రజల నమ్మకం మీద బిజెపి కూడా
అలాంటి తప్పు వైపు అడుగులు వేయ్యకూడదని నేను కోరుకుంటున్నాను. స్పెషల్ స్టేటస్ గురించి ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ఉద్యమించే లోపే రాష్ట్రంలోని అధికారపార్టీ ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలను కూడా కలుపుకొని పార్లమెంట్‌లో దీని మీద పోరాటం చేయాలని సీమాంద్ర ప్రజల తరపున నా విన్నపం.. అంటూ ట్వీట్ చేశాడు. ఏసీ గదుల్లో కూర్చొని ట్వీట్లు చేస్తే ఉపయోగం లేదని, ఆయనకు కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రత్యేకహోదాకు ప్రత్యక్షసాక్షిగా ఆయన పోరాటం చేయాలని, బిజెపిని ఎదిరించాలని సీమాంద్ర ప్రజలు స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు. మరి ప్రజల డిమాండ్ల మేరకు పవన్ రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తారా? ఇంకా నేను ప్రశ్నిస్తాను అంటూ సినిమాల షూటింగ్‌ల్లోనే కాలం గడుపుతారా? అనేది వేచిచూడాల్సిన విషయం.