పొరుగింటి పుల్లకూర రుచి.. దూరపుకొండలు నునుపుగా ఉంటాయి.. కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. ఈ సామెతలన్నీ ఏపీలోని కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతాయి. ఆ పార్టీలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. ఆయనకు ఉన్న ఇమేజ్ అందరికీ తెలిసిందే. కానీ రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులకు చిరుని ఎలా వాడుకోవాలో తెలియడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గత కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తమ పార్టీకి ఓ ఆకర్షణ గల నాయకుడు కావాలని, అందుకోసం పవన్‌ను లేదా జగన్‌ను పార్టీలో చేర్చుకోవాలని వాదిస్తున్నారు. తాజాగా ఈ అంశాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ మరోసారి నోరు విప్పి ఇదే విషయాన్ని లేవనెత్తాడు. అంటే వారి దృష్టిలో చిరు వేస్ట్ అనే భావన నెలకొందా? అనే అనుమానం తలెత్తుతోంది. మరి పవన్‌కళ్యాణ్‌ను పార్టీలో చేర్చుకోవాలని ఎందుకు కోరుతున్నారు? వారి దృష్టిలో చిరుకి కంటే పవన్‌కు ఎక్కువ ఇమేజ్ ఉందని భావిస్తున్నారా? వాస్తవానికి చిరు ఇమేజ్ వల్లే పవన్‌కి కూడా ఈనాడు ఇంత మైలేజ్ ఉంది అని అందరి అభిప్రాయం. కాపుల్లో కూడా పవన్‌తో పాటు చిరుకి కూడా ప్రత్యేకస్థానం ఉంది. ఆయన చేసిన తప్పు ఒక్కటే. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. అందువల్లే కాపులు ఆయన్ను నమ్మడం లేదని కొందరు అంటున్నారు. మరి అలాంటప్పుడు చిరుని కాంగ్రెస్‌లో ఉంచుకోవడం దేనికి? ఆ విషయానికి వస్తే చిరులో ఎన్ని లోపాలు ఉన్నాయో.. పవన్, జగన్‌లలో కూడా అంతకు మించిన లోపాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటప్పుడు చిరుని పక్కన పెట్టి పవన్‌ని, జగన్‌ని కాంగ్రెస్‌లోకి తీసుకోవాలనే డిమాండ్ ఎందుకు వస్తోంది.?? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మొలకెత్తుతోంది. మొత్తానికి తన తల మీద తానే చెయి పెట్టుకున్న కాంగ్రెస్‌ను చిరు కాదు కదా..! పవన్, జగన్‌లు కూడా గట్టెక్కించే పరిస్థితులు లేవని కాంగ్రెస్ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.