జనం నాడి బాగా తెలిసిన నేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అఁదుకే ఆయనకు ఓటు రాజకీయం కూడా తెలుసు. దండిగా తెరాసకు ఓట్లు వేయించుకోవడం తెలుసు. ఈ కారణం చేతనే పరిపాలన ధీమాగా చేయగలుగుతున్నారు. శుక్రవారం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు చాలా మంది తల్లితండ్రులకు సంతోషం కలిగించి ఉంటాయి. అదేమంటే ప్రయివేట్ విద్యాసంస్థలకు కళ్ళెం వేయడానికి నిర్ణయం తీసుకోవడం. కాలేజ్ మాఫియాకు చెక్ పెట్టడానికి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. లక్షలాది రూపాయల ఫీజు దండుకుంటూ ప్రాధమిక సౌకర్యాలు కల్పించని కాలేజ్ లపై కొరడా ఝలిపించడానికి కేసీఆర్ ప్రభుత్వం సిద్దమైంది. బిటెక్, ఏంటెక్ చదివిన అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులుగా ఉండడానికి కారణం కాలేజ్ యాజమాన్యాలే. సరైన ఫ్యాకల్టీ లేకుండా విద్యోబోధన చేయడం, కేవలం ఫీజల కోసమే కాలేజీలను నడపడం వల్ల పట్టాలు పుచ్చుకున్నవారు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారు. గత పాలకులు కాలేజీ మాఫియా చేతుల్లో కీలుబొమ్మలయ్యారు. డబ్బుతో మేనేజ్ చేయవచ్చని భ్రమించే ప్రయివేట్ కాలేజీల యాజమాన్యాల ఆగడాలకు చెక్ పెట్టడం పట్ల చాలా మంది తల్లితండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్కూల్స్ దూకుడుకు కూడా చెక్ పెడితే అంతా హర్షిస్తారు.