మైండ్ గేమ్ రాజకీయాలను తెలుగు రాష్ట్రాల్లో మీడియా నడిపిస్తోంది. ఏదో ఒక పార్టీకి కరపత్రంలా మారిన పత్రికలు ఎగస్పార్టీ మీద బురదజల్లేందుకు వెనుకాడడం లేదు. సందర్భం వస్తే మాత్రం పత్రికలు, విలువలు అంటూ పెద్ద పెద్ద మాటలేమాట్లాడుతున్నారు. ప్రజల పక్షం నిలవాల్సిన పత్రికలు నాయకుల పక్షం ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైకాపా అధినేత జగన్ తెదేపాలోకి జంప్ అవుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నారు. పార్టీ కేడర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనది కాబట్టి జగన్ చేస్తున్న పోరాటం సమర్ధనీయమే. కానీ సాక్షి మీడియా గ్రూప్ సైతం వైకాపా ఎమ్మెల్యేలు జంప్ కాకుండా మైండ్ గేమ్ ఆడుతుండడమే విచిత్రం. పత్రిక జగన్ దే కాబట్టి చేస్తే తప్పేంటనే ప్రశ్నరావచ్చు. అయితే అప్పుడుప్పడు పత్రికలు, విలువలు అంటూ సాక్షిలో కథనాలు వస్తుంటాయి కాబట్టి మనం దాని గురించి చెప్పుకోవచ్చు.
సాక్షిలో నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు లేదనే వార్తలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా ఈ సబ్జెక్ట్ తెరపైకి వచ్చింది. గత ఏడాది పార్లమెంట్ లో మంత్రి ఇచ్చిన సమాధానాన్ని నిన్ననే ఇచ్చినట్టు భ్రమించేలా కథనాలు రాశారు. 2026 వరకు నియోజకవర్గాలు పెరగనే పెరగవు అంటూ కొన్ని ఉదాహారణలతో సహా రాస్తున్నారు. అకస్మాత్తుగా నియోజక వర్గాల గురించి రాయడానికి కారణం వైకాపా నుండి తెదేపావైపు వెళుతున్న ఎమ్మెల్యేలను భయబ్రాంతులను చేయడమే. ఆల్ రెడీ ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే తెదేపా కేడర్ ఉంది. కొత్తగా చేరుతున్నవారికి భవిష్యత్తు ఎన్నికల్లో న్యాయం జరగాలంటే వాటి సంఖ్య పెరగాలి. లేదంటే కొత్తగా చేరినవారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే నియోజకవర్గాలు పెరగవు కాబట్టి తెదేపాలో చేరితో భవిష్యత్తు ఉండదని సాక్షి మీడియా చెప్పే ప్రయత్నం చేస్తోంది. వలసలు ఆపడానికి ఇదోరకమైన ఎత్తుగడ. ఎమ్మెల్యేలు ఎవరైనా తమకు భవిష్యత్తు లేదంటే ఆందోళన చెందుతారు. సరిగ్గా ఈ వీక్ నెస్ పైనే అనుకూల మీడియా మైండ్ గేమ్ ఆడుతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.