జగన్‌పై లక్షకోట్ల అవినీతి ఆరోపణలు వస్తే... దానికి అనుగుణంగా ఆ సంఖ్యను మరికాస్త పెంచి 1లక్ష34వేల కోట్లు చంద్రబాబు అవినీతి చేశారని ఆరోపించడాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని టిడిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక వైసీపీ ఎమ్మేల్యేలను 30కోట్లకు ఒక్కోక్కరిని సంతలో పశువుల్లా చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నాడు. కాగా వైయస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో టిఆర్‌ఎస్ సభ్యులను ఆపరేషన్ ఆకర్ష్‌తో తమ పార్టీలో చేర్చుకున్న జగన్ ఆనాడు ఎందుకు దీనిపై స్పందించలేదని టిడిపి ప్రశ్నిస్తోంది. వైసీపీ ఎమ్యేల్యేలను కొనుగోలు చేస్తున్నామని ఆరోపిస్తున్న వైసీపీ నాయకులకు టిడిపి నేతలు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఒక ఎమ్మేల్యేనైనా అలా కొనుగోలు చేశామని వైసీపీ వారు ఆధారాలు చూపించగలరా? లక్షా 34కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో బయటపెట్టగలరా? అని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నాయకులు సవాల్ విసురుతున్నారు. మరోవైపు గత ఎనిమిదేళ్లుగా చంద్రబాబు తన ఆస్తులను ప్రకటిస్తున్నాడని, కానీ జగన్ మాత్రం తన ఆస్తులను ఎందుకు ప్రకటించడం లేదని నారా లోకేష్ ఎదురుదాడికి దిగుతున్నాడు. ఆధారాలతో సహా వస్తే ఎక్కడైనా చర్చకు సిద్దమని ఆయన సవాల్ చేశారు. బ్రిటిష్ వారితో కలిసి వైయస్ కుటుంబం అరాచకాలకు పాల్పడిందని చరిత్ర తిరగదోడుతున్నారు. మరో అడుగు ముందుకేసి అండర్‌వరల్డ్ డాన్ దావూడ్ ఇబ్రహీం, బ్యాంకులకు వేలాదికోట్లు ఎగగొట్టిన విజయ్‌మాల్యా, జగన్‌లు ఒకే జాతికి చెందిన వారని విమర్శలకు పదునుపెట్టారు. చంద్రబాబుకు దమ్ముంటే వైసీపీని వీడి టిడిపిలోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మేల్యేల చేత రాజీనామా చేయించి గెలిపించుకోవాలని వైసీపీ నేతలు చేస్తున్న సవాల్‌ను కూడా టిడిపి వర్గాలు స్వీకరిస్తున్నాయి. తాము టిడిపిలో చేరిన ఎమ్మేల్యేలను రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేస్తామని అదే సమయంలో వైసీపీ కూడా తమ పార్టీ ఎమ్మేల్యేలైన రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల చేత రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించాలని టిడిపి సవాల్ విసురుతోంది. ఈ ముగ్గురు అసెంబ్లీలో చేసిన వెలికిచేష్టలకు ప్రజలే బుద్ది చెప్తారన్న ధోరణిలో టిడిపి నాయకులు ఉన్నారు. మొత్తానికి రోజు రోజుకీ ఏపీ రాజకీయాలు ఈ ఎండాకాలంలోని వేడిని కన్నా ఎక్కువ సెగను రాజేస్తున్నాయి.