గజఈతగాడు ఇంటి వెనుక మురుగు కాలువలో పడి ప్రాణాలు వదిలాడట. సరిగ్గా తెరాస మంత్రి హరీష్ రావు ఇదే పరిస్థితి ఎదురైంది. వరంగల్, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో సింగిల్ హ్యాండ్ తో పార్టీని గెలిపించి పార్టీలో పట్టుపెంచుకున్నారు. కానీ ఆయనకు సొంత నియోజకవర్గం సిద్దిపేటలో మాత్రం ప్రతికూల పరిస్థితి ఎదురైంది. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో తెరాస గెలుపు బాధ్యతను చేపట్టిన హరీష్ మెుత్తం 34 స్థానాలు గెల్చుకుంటామనే నమ్మకంతో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు గతంలో సిద్దిపేట సొంత నియోజకవర్గం. అక్కడ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేసినట్టు ఇటీవలే కేసీఆర్ వెల్లడించారు. అంతటి బలమున్న చోట తెరాసకు ఇబ్బందికర ఫలితాలు వచ్చాయి. 12 స్థానాల్లో ప్రత్యర్ధులు గెలుపొందారు. మున్సిపల్ పీఠం దక్కినప్పటికీ తిరుగుబాటు దార్లు, కాంగ్రెస్, బిజెపి, ఎం.ఐ.ఎం. అభ్యర్దులు గెలుపొందడం హరీష్ రావును ఇబ్బందిలోకి నెట్టాయి. ఈ ఫలితం ఆయన ప్రత్యర్ధులకు వరమైంది. ఇటీవలే జరిగిన మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట పంచాయితీలో మెుత్తం 20 వార్డులను తెరాస గెలుచుకుంది. ఇదే తరహా ఫలితాన్ని సిద్దిపేటలో ఆశించారు. ఓటమికి కారణాలు అనేకం ఉన్నాయి.హరీష్ ఏకపక్ష వైఖరి, బలమున్న వారికి టికెట్ నిరాకరించడం, బెదిరింపులు, డెవలప్ చేశాం ప్రజలే ఓట్లు వేస్తారనే అతి నమ్మకం కలిసి ఈ ఫలితాన్ని తెచ్చాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా తెరాసవైపే ఉన్నారనే భ్రమకు సిద్దిపేట కొంతమేర బ్రేక్ వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సైతం అవలీలగా గెలిచిన తెరాస కేసీఆర్ ఛరిష్మా ఉన్నసిద్దిపేటలో మాత్రం పోటీని ఎదుర్కోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గెలిచిన వారందరిని పార్టీలోకి లాగేసుకుంటారు. కానీ అది వేరే విషయం. ఇప్పటి వరకు తమకు ఏక పక్షంగా బలం ఉందనే అతి నమ్మకం వమ్మయింది. సిద్దిపేట ఫలితం తెరాసకు కొత్తపాఠాలు చెప్పింది.