పీకి ప్రత్యేకహోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా నల్లపాడులో చేపట్టిన దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం నాటికి ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త విషమించింది. అయినా అటు రాష్ట్ర ప్రభుత్వంలోగాని.. ఇటు కేంద్ర ప్రభుత్వంలోగాని ఎలాంటి కదలిక లేకుండాపోయింది. జగన్ దీక్ష గురించి ఇన్నాళ్లపాటు పట్టించుకోకుండా ఉన్న సీఎం చంద్రబాబు.. ఆదివారం ఆ విషయమై స్పందించారు. ప్రత్యేకహోదాతో సాధించేదేమీ ఉండదని.. అయినా తమ ప్రభుత్వం ప్రత్యేకహోదాతోపాటు ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఇక జగన్ దీక్షకు అటు ప్రజలనుంచి ఇటు పాలకవర్గాలనుంచి కూడా స్పందన కరువవడంతో వైసీపీ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.
జగన్ దీక్ష చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక విషయాలపై ఆయన ఒకరోజు, రెండు రోజుల దీక్షలు అనేకం చేపట్టారు. దీంతో జగన్ దీక్షలపై ప్రజల్లో రానురాను ఆసక్తి సన్నగిల్లింది. ఆయన నిరవధిక దీక్ష కాకుండా ఒకటి, రెండు రోజుల దీక్షలు చేపడుతుండటం.. ప్రజలకు ప్రత్యేకంగా కనిపించలేదు. ఈసారి ఆయన ఏకంగా నిరవధిక దీక్ష చేపట్టినా అందుకే ప్రజలనుంచి పెద్దగా స్పందన రావడం లేదు.
ఇక జగన్ దీక్షకు స్పందన కరువవడంతో వైసీపీ మేల్కొంది. ఈ దీక్షకు మద్దతుగా నియోజకవర్గాలవారీగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నాలకు, రాస్తారోకోలకు దిగి ఈ దీక్షకు ప్రచారం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక జగన్ విషయానికొస్తే.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అన్నది.. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడిన అంశం. జగన్ యావత్తు టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే మినహాయించి నరేంద్రమోడీని పల్లెత్తు మాట అనడం లేదు. ప్రత్యేకహోదా ఇచ్చే అధికారం ఉన్న కేంద్రాన్ని కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారపడుతూ.. జగన్ సాధించేదేమీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు. తనపై ఉన్న కేసులకు భయపడే ఆయన కేంద్రాన్ని ఏమీ అనడం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళుతాయని కూడా వారు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా జగన్ తన పంథా మార్చుకుంటే బాగుంటుందేమో!.