రామాయణ: ఉత్కంఠ నడుమ గంట ముందే డెలివరీ
Ramayana designer delivered Ranbir Kapoor’s armor an hour before shoot
నితీశ్ తివారీ తెరకెక్కించిన `రామాయణం` మొదటి భాగం షూటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విశేషం బాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో రాముడిగా నటించిన రణ్‌బీర్ కపూర్ కోసం రూపొందించిన యుద్ధ కవచం తయారీ వెనుక జరిగిన సవాళ్ల గురించి కాస్ట్యూమ్ అండ్ ఆర్మర్ డిజైనర్ అజయ్ కుమార్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో రణ్‌బీర్ కపూర్ ధరించిన రాచరికపు కవచాన్ని డిజైన్ చేయడం తనకు కెరీర్లోనే అతిపెద్ద సవాల్‌గా నిలిచిందని డిజైనర్ అజయ్ కుమార్ తెలిపారు. మొదట తాను తయారు చేసిన నమూనా కవచం మందం 8 నుండి 10 మిల్లీమీటర్లు ఉండగా ఫైనల్ ప్రొడక్ట్ మాత్రం 2 - 4 మిల్లీమీటర్ల మందంతో రబ్బరుతో తయారు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రణ్‌బీర్ కపూర్ ఇన్పుట్స్ ప్రకారం డిజైన్‌లో మరిన్ని మార్పులు చేయాల్సి రావడంతో ఈ ప్రక్రియ మరింత కష్టతరంగా మారింది.
షూటింగ్ సమయానికి సరిపోయేలా రణ్‌బీర్ కపూర్ కొన్ని కీలక సూచనలు చేశారు. కవచం షోల్డర్ ..నెక్ లైన్‌కు దూరంగా కాకుండా శరీరానికి సరిగ్గా అతుక్కునేలా మరింత రిఫైన్డ్గా ఉండాలని కోరారట. లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్న రవి దూబే నుండి కూడా సరిగ్గా ఇదే రకమైన ఫీడ్ బ్యాక్ వచ్చిందని డిజైనర్ వెల్లడించారు. ఈ మార్పులు చేయడానికి రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో తీవ్ర ఉత్కంఠ నడుమ షూటింగ్‌కు సరిగ్గా గంట ముందు కవచాన్ని అందించినట్లు తెలిపారు. రణ్‌బీర్ కపూర్ న వ్యానుటీలో కవచాన్ని ధరించి పర్ఫెక్ట్గా సరిపోవడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అజయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. `నా పనితీరును మెచ్చి రణబీర్ నన్ను అభినందించారు` అని తెలిపారు.
















































