రామాయణం 2వ ట్రైలర్: భారీ VFX ట్రీట్
Ramayana Trailer Talkఆగస్టులో విడుదలైన మొదటి ఇంగ్లీష్-డబ్బింగ్ ట్రైలర్ తర్వాత, మేకర్స్ `రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్`కి సంబంధించిన మరో ఆకట్టుకునే రెండవ ట్రైలర్ను విడుదల చేశారు. ది ఒడిస్సీ, డ్యూన్ చిత్రాలకు పనిచేసిన విజువల్ ఆర్టిస్టులు ఈ సినిమాలో భాగమయ్యారని, ఈ చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు, ఐమ్యాక్స్ - ప్రీమియం లార్జ్ ఫార్మాట్లలో విడుదల కానుందని.. టికెట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని అధికారిక క్యాప్షన్ పేర్కొంది.
నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండగా.. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ - యశ్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నాయి.
తాజాగా విడుదలైన కొత్త ట్రైలర్లో అగ్ని- కోపంతో జన్మించి, దేవతలను తన దారికి తెచ్చుకున్న రావణాసురుడిని పరిచయం చేశారు. దీనికి విరుద్ధంగా చరిత్ర గతిని మార్చి.. చెడు ముసుగును తుడిచిపెట్టిన శ్రీరాముడి పాత్రను చూపించారు. యశ్ ఇంటెన్స్ లుక్ .. రాముడి ప్రశాంతమైన, ప్రభావవంతమైన ప్రవర్తన ఇతిహాస చిత్రంపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. రాముడు-సీతల కలయికను హైలైట్ చేయడం ద్వారా ఈ ట్రైలర్ కథలోని డెప్త్ ని ఆవిష్కరించింది. ట్రైలర్ లో రామ వర్సెస్ రావణ యుద్ధంతో పాటు, రావణాసురుడి అజేయమైన దండయాత్రల్ని అద్భుతంగా చూపించారు.
భారీ సెట్లు, ఆకట్టుకునే వీఎఫ్ఎక్స్, అలాగే పుష్పక విమానం - రావణుడితో వీరోచితంగా పోరాడిన పక్షి జటాయువు .. ఈ విజువల్ వండర్ను మరింత మెరుగుపరిచాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ఇతిహాస చిత్రంలో మొదటి భాగం ఈ ఏడాది హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, రెండవ భాగం 2027 దీపావళికి రానుంది. భారతదేశం మినహా ప్రపంచవ్యాప్త పంపిణీ బాధ్యతలను సోనీ పిక్చర్స్ నిర్వహిస్తుండగా.. హిందీ మాట్లాడే మార్కెట్లో ధర్మ ప్రొడక్షన్స్ పంపిణీని చూసుకోనుంది.















































