రూ.4000 కోట్ల భారీ ప్రాజెక్ట్‌కి ఐటీ సెగ!
IT raids on Ramayana producer
భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న `రామాయణ` చిత్ర నిర్మాత, ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రాకు ఊహించని షాక్ తగిలింది. ముంబైలోని ఆయన ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కంపెనీ అయిన ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. `రామాయణ` మొదటి భాగం విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఐటీ శాఖ ఈ దాడులు నిర్వహించడం చిత్ర పరిశ్రమతో పాటు బిజినెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అక్టోబర్ 7న ప్రారంభమైన ఐటీ సోదాలు బుధవారం ఉదయం వరకు కొనసాగాయి. ప్రైమ్ ఫోకస్ ముంబై ప్రధాన కార్యాలయాలతో పాటు ఆ సంస్థతో సంబంధం ఉన్న పలువురు కీలక వ్యక్తుల నివాసాలలో కూడా అధికారులు తనిఖీలు జరిపారు. కొన్ని విదేశీ నగదు బదిలీ (ఫారిన్ రెమిటెన్స్) లావాదేవీలకు సంబంధించి అక్రమాలు జరిగాయనే అనుమానంతోనే ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఐటీ రైడ్స్ వార్తలు బయటకు రావడంతో అక్టోబర్ 7న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ప్రైమ్ ఫోకస్ షేర్లు దాదాపు 8 శాతం మేర పతనమయ్యాయి.
1997లో నమిత్ మల్హోత్రా ముంబైలో స్థాపించిన `ప్రైమ్ ఫోకస్` కాలక్రమేణా విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్, యానిమేషన్ విభాగాల్లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దిగ్గజ సంస్థగా ఎదిగింది. ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ప్రముఖ హాలీవుడ్ విఎఫ్ ఎక్స్ కంపెనీ `DNEG` కూడా ప్రైమ్ ఫోకస్ నెట్‌వర్క్‌లోనే భాగం కావటం విశేషం. `ఇన్‌సెప్షన్`, `ఇంటర్‌స్టెల్లార్`, `బ్లేడ్ రన్నర్ 2049`, `ఫస్ట్ మ్యాన్`, `టెనెట్`, `డ్యూన్` (పార్ట్ 1, పార్ట్ 2) వంటి ప్రతిష్టాత్మక హాలీవుడ్ చిత్రాలకు విశ్వవ్యాప్తంగా విజువల్ ఎఫెక్ట్స్ అందించి DNEG ఏకంగా 8 ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకుంది.
ప్రస్తుతం నితీష్ తివారి దర్శకత్వంలో 4,000 కోట్ల బడ్జెట్‌తో `రామాయణ` చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ - DNEG సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారతీయ చలనచిత్ర రంగాన రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. శాన్ డియాగో కామిక్-కాన్ ఈవెంట్‌లో నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. `రామాయణ` చిత్రం `లార్డ్ ఆఫ్ ది రింగ్స్`, `అవతార్`, `గ్లాడియేటర్` వంటి హాలీవుడ్ విజువల్ వండర్స్ తరహాలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు .. భావోద్వేగాల కలయికతో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
















































