ఆ సినిమా రీకాస్టింగ్ వెనుక అసలు కథ ఇదే!
Director on Mirzapur The Movie Making`మిర్జాపూర్: ది మూవీ` థియేటర్లను సైతం షేక్ చేసిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 333 కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సినిమా మేకింగ్ , కీలక పాత్రల ఎంపికపై దర్శకుడు గుర్మీత్ సింగ్ స్పందించారు. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లో బబ్లూ పండిత్ గా అలరించిన విక్రాంత్ మాస్సే స్థానంలో మూవీ వెర్షన్‌లో జితేంద్ర కుమార్‌ను ఎంపిక చేయడంపై జరుగుతున్న చర్చకు ముగింపు పలికారు. నటీనటుల మార్పు సినిమాకు ఎలాంటి అదనపు బలాన్ని చేకూర్చిందో వివరించారు.
క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు కొత్త మార్పులు చేసుకోవడానికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయని, కళాకారులుగా తమ మనసుకు తోచిన నిర్ణయాలను అనుసరించడం కీలకమని గుర్మీత్ సింగ్ తెలిపారు. విక్రాంత్ మాస్సే స్థానంలో జితేంద్ర కుమార్ ప్రాజెక్ట్‌లోకి రావడం వల్ల సినిమాకు సరికొత్త ఎనర్జీ లభించిందన్నారు. వెబ్ సిరీస్‌తో పోలిస్తే మూవీకి ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి ఈ మార్పు ఎంతగానో దోహదపడిందని.. తమకు ఎదురైన ఈ సవాలు ఒక విధంగా మంచి అవకాశంగా మారిందన్నారు.
అలాగే నటుడి మార్పుతో బబ్లూ పండిత్ పాత్రను పూర్తిగా కొత్త కోణంలో పునర్నిర్మించే అవకాశం లభించిందన్నారు. వెబ్ సిరీస్‌లోని బబ్లూ పాత్ర కేవలం తన అన్నకు సహాయకుడిగా, పరిస్థితుల బాధితుడిగా కనిపించేవాడని, కానీ సినిమాలో మాత్రం బబ్లూ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత, అధికారం ఇచ్చామన్నారు. మూవీలో జితేంద్ర కుమార్ పోషించిన బబ్లూ పాత్ర కేవలం ఒక బాధితుడిలా కాకుండా కథను ముందుండి నడిపించే గేమ్‌చేంజర్‌గా కనిపిస్తుందని.. ఇలా ఎదురైన ఆటంకాలను అనుకూలంగా మలచుకోవడమే నిజమైన సృజనాత్మకత అని గుర్మీత్ సింగ్ వివరించారు.















































