ఫోటోగ్రాఫర్ల మనసు గెలిచిన ఐశ్వర్య రాయ్!
Aishwarya Rai obliges to paps requestపారిస్ ఫ్యాషన్ వీక్‌లో అందచందాలతో అదరగొట్టిన బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇటీవల ముంబైకి తిరిగి వచ్చారు. విమానాశ్రయం వెలుపల తనను కవర్ చేయడానికి నిరీక్షిస్తున్న ఫోటోగ్రాఫర్లు, అభిమానులతో ఐష్ ఆప్యాయంగా ముచ్చటించారు. ఒక అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన అనంతరం నిరంతరం ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్లను చూసి `కెమెరాలను కాసేపు పక్కన పెట్టి, అందరం కలసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం` అని ఐశ్వర్య స్వయంగా పిలిచారు. వారందరినీ ఒకే దగ్గరకు ఆహ్వానించి సంతోషంగా గ్రూప్ పిక్ ఇవ్వడం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రయాణంలో ఐశ్వర్య రాయ్ సరికొత్త బర్గండి హెయిర్ కలర్ స్టైల్‌లో ఆకట్టుకున్నారు. సింపుల్ అండ్ స్టైలిష్ ఓవర్-ఫ్లేర్డ్ జీన్స్, లార్జ్ ట్రెంచ్ కోట్ ధరించిన ఐష్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తూ ప్రశాంతమైన నవ్వుతో అందరికీ అభివాదం చేశారు. సాధారణంగా మీడియా హడావుడి ఉండే ఎయిర్‌పోర్ట్ వద్ద కెమెరాల పట్ల ఆమె చూపించిన సహనం, వినయం , ఆప్యాయతను చూసి ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
పారిస్ ఫ్యాషన్ వీక్ విషయానికొస్తే ఐశ్వర్య రాయ్ రాయల్ లుక్‌తో రన్‌వేపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 3D ఫ్రింజ్ ఎంబ్రాయిడరీ, క్రిస్టల్ డిజైన్ క్యాప్ , డైమండ్ కిరీటంతో అలంకరించిన బ్లాక్ వేల్వెట్ గౌనులో ఐష్ దేవతలా మెరిసిపోయారు. సూపర్ మోడల్ కేండల్ జెన్నర్ చేయి పట్టుకుని రన్‌వేపై నడవడంతో పాటు సిమోన్ యాష్లే, ఈవా లాంగోరియా వంటి ప్రముఖ అంతర్జాతీయ తారలతో కలిసి ఈవెంట్‌లో సందడి చేశారు.
















































