వెండితెరపై మారాల్సిన కథల ధోరణి!
Big Screenసమాజంపై సినిమాల ప్రభావం ఉందనేది నిరాకరించలేని నిజం. భాష, సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి ఆలోచనా సరళిని, సమాజ పోకడలను ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనం సినిమా. వినోదం అందించడమే కాకుండా భావి తరాల మానసిక వికాసానికి, మంచి సమాజ నిర్మాణానికి చిత్ర పరిశ్రమ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నేటి కథానాయకులు ఎలాంటి సినిమాలు తీయాలి అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
సినిమాలు రెండున్నర గంటల కాలక్షేపం మాత్రమే కాదు. యువత ఆలోచనలపై లోతైన ప్రభావం చూపుతాయి. తెరపై హీరోల ప్రవర్తన, మాట తీరు, విలువలను అభిమానులు, చిన్నారులు యువత అనుకరించడం సర్వసాధారణం. అందుకే సమాజానికి ప్రతికూల సంకేతాలు ఇచ్చే అంశాల కంటే ఆదర్శవంతమైన నైతిక విలువలను పెంపొందించే కథాంశాలను ఎంచుకోవాల్సిన గురుతర బాధ్యత నేటి హీరోలపై ఉందనే మాట వినిపిస్తోంది.
బాక్సాఫీస్ విజయాల కోసం నేడు చిత్రసీమలో రస్టిక్, రక్తపాతం , అనవసరమైన వైలెన్స్ పెరిగిపోతోందనే ఆందోళన ఉంది. వైలెన్స్‌ను గ్లోరిఫై చేసే సినిమాల కంటే సామాజిక చైతన్యాన్ని, మానవ సంబంధాలను , వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే సినిమాలు రావడం ముఖ్యం. సమాజంలో మనుషుల మధ్య తగ్గుతున్న సహనం, ప్రేమను మళ్లీ గుర్తుచేసే కంటెంట్‌ను హీరోలు కమర్శియల్ కోణంలో శంకర్ స్టైల్లో చెప్పగలగాలి.
పర్యావరణ స్పృహ, మానసిక ఆరోగ్యం, మూఢనమ్మకాల నిర్మూలన, స్త్రీ సాధికారత , సాంకేతికత తెచ్చే మార్పులు వంటి వర్తమాన సామాజిక అంశాలపై దర్శక, రచయితలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వాస్తవిక సవాళ్లను ప్రతిబింబిస్తూనే వాటికి పరిష్కార మార్గాలను చూపే సినిమాలు భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. సైన్స్, స్పోర్ట్స్, హిస్టరీ ఆవిష్కరణల నేపథ్యంలో వచ్చే బయోపిక్‌లు యువతలో ఆశావహ దృక్పథాన్ని పెంపొందిస్తాయి. ఇలాంటి కథల్ని కమర్శియల్ గా చెప్పగలిగితే? సందేశంతో పాటు మంచి వసూళ్లకు అవకాశం ఉంటుందంటున్నారు.
యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, కెరీర్ సవాళ్లు, ఆత్మహత్య ధోరణులను అధిగమించేలా ధైర్యాన్నిచ్చే కథలను హీరోలు ఎంచుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు హింస తో కాకుండా, విచక్షణ , వివేకంతో వాటిని ఎలా ఎదుర్కోవాలో చూపే పాత్రలను పోషించడం వల్ల సమాజంలో సానుకూల మార్పు కు అవకాశం ఉంటుంది. నటుల ఇమేజ్ ద్వారా వచ్చే సందేశం జనాల్లోకి వేగంగా చేరుతుంది. కాబట్టి వారు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉంది.
















































