సూర్య వేగం వర్సెస్ టాలీవుడ్ హీరోల ఆలస్యం!
Suriya's Speed vs. Tollywood Heroes' Delays!
మేకింగ్ వేగం, బాక్సాఫీస్ ప్రణాళికలు నటీనటుల స్టార్‌డమ్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరోలు నాని, నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్, సిద్ధు జొన్నలగడ్డ వంటి వారు క్వాలిటీ, విజువల్స్ , కథల ఎంపిక నెపంతో ఒక్కో సినిమాకు ఏకంగా ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలతో థియేటర్లను కళకళలాడించిన తెలుగు హీరోలు ఇప్పుడు సుదీర్ఘ గ్యాప్ తీసుకుంటూ నెమ్మదిగా ప్రాజెక్టులను పూర్తి చేస్తుండటం పట్ల అభిమానుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
దీనికి పూర్తి భిన్నంగా తమిళ స్టార్ హీరో సూర్య వేగంతో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. 2026 ఒకే ఏడాదిలో ఆయన ఏకంగా మూడు విభిన్నమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. `కరప్పు` (లేదా వీరభద్రుడు) , వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన భారీ హిట్ చిత్రం `విశ్వనాథన్ అండ్ సన్స్` సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సూర్య తాజాగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తున్న `సీన్` చిత్రంతో దీపావళికి మూడోసారి పలకరించేందుకు సిద్దమవుతన్నారు. ఈ తరహా ప్లానింగ్ .. శ్రమ ఆయన అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
టాలీవుడ్ హీరోలు మాత్రం పాన్-ఇండియా ఆలోచనలు, పర్ఫెక్షన్ పేరుతో అతిగా సమయాన్ని వృథా చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఒకే ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టడం వల్ల ఆ సినిమా ఫలితం తేడా కొడితే హీరోల కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడమే కాకుండా మార్కెట్ స్థిరత్వం కూడా దెబ్బతింటోంది. వేగంగా సినిమాలు పూర్తి చేస్తూనే నాణ్యతను కాపాడుకోవచ్చని సూర్య లాంటి నటులు నిరూపిస్తుండటంతో తెలుగు హీరోలు కూడా తమ వర్కింగ్ స్టైల్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పరిశ్రమ సజీవంగా ఉండాలంటే హీరోలు క్రమం తప్పకుండా థియేటర్లకు రావడం ముఖ్యమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదికి కనీసం రెండు చిత్రాలైనా విడుదల చేస్తేనే మార్కెట్ , పంపిణీ వ్యవస్థ బలంగా ఉంటాయి. సూర్య తరహా రాకెట్ వేగం సరైన ప్రణాళిక టాలీవుడ్ కథానాయకులకు కన్నువిప్పు లాంటిదని.. ఇకనైనా తెలుగు హీరోలు క్వాలిటీతో పాటు స్పీడ్‌ను కూడా పెంచి ఏడాదికి ఒకటికి మించి సినిమాలు రిలీజ్ చేయాలని సినీ ప్రియులు ఆశిస్తున్నారు.
















































