సమయం ఆసన్నమైందంటూ కాజల్ సంచలన వ్యాఖ్యలు!
Kajal Aggarwal on global appeal of Ramayanaబాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న `రామాయణం`పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రంలో నటి కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా గ్లోబల్ మార్కెటింగ్ .. అంతర్జాతీయ స్థాయిలో దీనికి ఉండే ఆదరణ గురించి కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మన దేశపు పురాణ ఇతిహాసాలను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఇదే సరైన తరుణమని కాజల్ అభిప్రాయపడ్డారు.
రామాయణం కథ ప్రతి ఒక్క భారతీయుడి రక్తంలోనూ, ఊపిరిలోనూ కలిసిపోయి ఉంటుందని తెలిపారు. చిన్నతనం నుంచి మనం ఎంతో ఆరాధించే శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వంటి అద్భుతమైన పాత్రల ద్వారా మన సొంత సూపర్ హీరో కథలను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. భారతీయ సినిమా గ్లోబల్ స్థాయిలో దూసుకెళ్తున్న తరుణంలో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అంతకంటే గొప్ప కథ ఉండదని నొక్కి చెప్పారు.
మర్యాద పురుషోత్తముడైన రాముడి పాత్రను తెరపై ఆవిష్కరించడానికి .. రణ్‌వీర్ కపూర్ ఆ పాత్రలో నటించడం ఈ తరానికి గొప్ప ప్రాతినిధ్యం అని కాజల్ కొనియాడారు. ఈ బృహత్తర ప్రాజెక్ట్‌లో భాగం కావడం తనకు నటిగా ఎంతో సంతృప్తినిచ్చిందని.. భారతీయ తెరపై ఇంతటి భారీ స్థాయిని ఇప్పటివరకు ఎవరూ చూసి ఉండరని కాజల్ అభిప్రాయపడ్డారు.
















































