స్టోరీ ఎలా ఉండాలన్నది ఆ హీరో మాటల్లో!
John Abraham to Play Former Mumbai Police Commissioner Rakesh Maria
సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉండాలని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం అభిప్రాయపడ్డారు. తన చిత్రాలేవైనా? ఒక ప్రకటన కోసం కాకుండా అవి ఎంతో నిజాయితీతో.. భావోద్వేగంతో కూడినవిగా ఉండేలా జాగ్రత్త పడతానన్నారు. నిర్మాతగా తాను ఎంచుకునే కథలు ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉండాలని.. అలాంటి అద్భుతమైన కథలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యమని వెల్లడించారు.
ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో ఆయన పాత్రను పోషించడం తనకు సవాలుతో కూడిన బాధ్యత అని జాన్ అన్నారు. రాకేష్ మారియా లాంటి గొప్ప వ్యక్తి పాత్రను పోషించేటప్పుడు అనుకరించడం మాత్రమే కాకుండా వారి ఆలోచనా విధానాన్ని ..ఆ సమయంలో వారు ఎదుర్కొన్న ఒత్తిడిని అర్థం చేసుకోవడం ముఖ్యమని తెలిపారు. రాకేష్ మారియా పాత్ర కోసం పూర్తిగా అన్ని రకాలుగా సన్నదమై బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా కొత్త విషయాలను తెలుసుకోవాలని కోరుకుంటున్నారని, అందువల్లే డాక్యు మెంటరీలు వంటి నిజాయితీతో కూడిన చిత్రాలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయని జాన్ అభిప్రాయపడ్డారు. కథాంశం ఏదైనా? అది ప్రేక్షకులను ఆలోచింపజేసేలా .. చర్చించేలా ఉంటే? ఆ సినిమా తన ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నట్లేనని నమ్మకం వ్యక్తం చేశారు. విభిన్న కోణాలను ప్రదర్శించే బలమైన కథలే నేటి సినిమా రంగానికి అవసరమని జాన్ అబ్రహం అభిప్రాయపడ్డారు.







































