ఆకాశంలో విమానాలు పరిగెత్తితే షూటింగ్ ఆపేయడమే!
Ashutosh Gowariker On Possible Lagaan Remakeభారతీయ చలనచిత్ర పరిశ్రమలో మైలురాయిగా నిలిచిన చిత్రం `లగాన్`. ఈ చిత్రం విడుదలై పాతికేళ్లు పూర్తవుతున్న శుభసందర్భంలో నాటి ఆసక్తికర ప్రయాణాన్ని స్క్రీన్‌ప్లే రచయిత కుమార్ దేవ్ పంచుకున్నారు. అప్పట్లో బ్రిటిష్ కాలం నాటి పన్నులు, కరవు, క్రికెట్ ఆట చుట్టూ తిరిగే భిన్నమైన కథను ఏ కమర్షియల్ నిర్మాత కూడా నమ్మలేదని పేర్కొన్నారు. కథలో హీరో ధోతీ కాకుండా సమకాలీన దుస్తులు ధరించేలా మార్పులు చేయాలని ఎందరో సలహాలు ఇచ్చినప్పటికీ దర్శకుడు అశుతోష్ గోవారికర్ మాత్రం తన నమ్మకాన్ని వదులుకోలేదు.
చివరకు అమీర్ ఖాన్ ఈ కథను నమ్మి, నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టడం వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందన్నారు. ఒకవేళ ఆయన లేకపోతే `లగాన్` అనే అద్భుతం రూపుదిద్దుకునేదే కాదని దేవ్ స్పష్టం చేశారు.
ఈ చిత్ర స్క్రీన్‌ప్లేను పకడ్బందీగా సిద్ధం చేయడం వెనుక భారీ కసరత్తే జరిగిందని రచయిత వెల్లడించారు. దర్శకుడు అశుతోష్ గోవారికర్, కుమార్ దేవ్, సంజయ్ దమ్యాలు ముంబైకి సమీపంలోని కర్జత్ అనే ప్రాంతానికి వెళ్లి, బాహ్య ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంటూ నెల రోజుల పాటు కథా చర్చలు జరిపారు. ఆ సమయంలో వారి మధ్య ఎన్నో భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ సృజనాత్మక విభేదాలను పక్కన పెట్టి మెజారిటీ అభిప్రాయాల ఆధారంగా ఏకంగా 12 విభిన్న డ్రాఫ్ట్‌లను సిద్ధం చేశారు.
ఈ సుదీర్ఘమైన నిరంతరాయమైన సృజనాత్మక ప్రక్రియే లగాన్ చిత్రానికి బలమైన పునాదిని నిర్మించిందన్నారు. కథను తెరకెక్కించే క్రమంలో గుజరాత్‌లోని భుజ్ పరిసరాల్లో దాదాపు ఆరు నుండి ఏడు నెలల పాటు అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో చిత్రీకరణ సాగింది. అప్పట్లో సరికొత్త సాంకేతికత అయిన సింక్ సౌండ్ విధానాన్ని ఉపయోగించడం వల్ల, ఆకాశంలో విమానాలు వెళ్లేటప్పుడు షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చేదని కుమార్ దేవ్ గుర్తుచేసుకున్నారు.







































