మాస్ మహారాజా ఎనర్జీకి సింగం మార్క్ యాక్షన్!
Ravi Teja and Hari to unite For an Action Film
టాలీవుడ్ కమర్షియల్ సినిమా రంగంలో సరికొత్త కాంబినేషన్ల హడావుడి ఎప్పుడూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మాస్ మహారాజా రవితేజ- కోలీవుడ్ యాక్షన్ పల్స్ తెలిసిన స్టార్ డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లైన్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. హరి అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది`'సింగం` సిరీస్ చిత్రాలే. బుల్లెట్ వేగంతో దూసుకుపోయే స్క్రీన్‌ప్లే, అల్ట్రా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, దానికి తోడు ప్రేక్షకుల హృదయాలను కదిలించే ఫ్యామిలీ ఎమోషన్స్‌ను దట్టించడం ఆయన ప్రత్యేక శైలి.
మరోవైపు రవితేజకు ఉండే వింటేజ్ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరి బలాలు గనుక ఒకే వేదికపైకి వస్తే థియేటర్లలో మాస్ జాతర ఏ రేంజ్‌లో ఉంటుందోనని అభిమానులు అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం రవితేజ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఇరుముడి` చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో కూడిన ఒక విభిన్నమైన పాత్రలో రవితేజ ఈ సినిమాలో కనిపించబోతున్నారు.
ఈ క్లాస్ అండ్ ఎమోషనల్ డ్రామా షూటింగ్ పూర్తి కాగానే ఆయన మళ్లీ అసలైన మాస్ రూట్‌లోకి రావడానికి హరి ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నట్లు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. ఇటీవలే దర్శకుడు హరి హైదరాబాద్ వచ్చి రవితేజను కలిశారని, ఒక పవర్‌ఫుల్ వన్‌లైన్ స్టోరీని వినిపించారని సమాచారం. కథ విన్న వెంటనే మాస్ మహారాజా బాగా ఇంప్రెస్ అయ్యారని, స్క్రిప్ట్‌ను పూర్తి స్థాయిలో డెవలప్ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి.







































