NTR ఐడియాల‌తోనే డ్రాగ‌న్ స్క్రిప్ట్!

పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ `డ్రాగన్` స్క్రిప్ట్ నేరేష‌న్, క్రియేటివ్ జ‌ర్నీకి సంబంధించి దర్శకుడు ప్రశాంత్ నీల్ సరికొత్త ఆసక్తికర విషయాలను తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఈ డార్క్ షేడ్ యాక్ష‌న్ కథను పరిపూర్ణంగా మలిచే క్రమంలో తామిద్దరం కలిసి గడిపిన ఐదేళ్ల సుదీర్ఘ కాలంలో, తొలి రెండేళ్ల పాటు ఎలాంటి రచయితల సాయం లేకుండా కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఆలోచనల ఆధారంగానే స్క్రిప్ట్ రూపుదిద్దుకుందని ఆయన వెల్లడించారు.

కథలో వచ్చే కీలకమైన భావోద్వేగ సన్నివేశాల ఎలివేషన్‌తో పాటు... సినిమా ముగింపులో వచ్చే అత్యంత ప్రాధాన్యత కలిగిన క్లైమాక్స్ సీన్‌ను రక్తికట్టించడానికి తారక్ అందించిన సరికొత్త ఐడియాలు, సూచనలే ఈ స్క్రిప్ట్‌ను ఇంత అద్భుతంగా మార్చడానికి మూలకారణమని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు.

సగటు సూపర్‌స్టార్లు సాధారణంగా ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని ఒక సంక్లిష్టమైన, పూర్తి ప్రతికూల ఛాయలు కలిగిన `డార్క్ షేడ్` పాత్రను ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషిస్తున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఒక అగ్ర హీరో తన ఇమేజ్ చట్రాన్ని పక్కనపెట్టి.. నైతికతకు దూరంగా ఉండే ఇటువంటి నెగెటివ్ క్యారెక్టర్‌ను ఎంచుకోవడం ఇండస్ట్రీలో ఒక పెద్ద సాహసమే అయినా కథలోని గాఢతను నమ్మి తారక్ ఈ సవాలును స్వీకరించడానికి వెంటనే సిద్ధమయ్యారని ఆయన కొనియాడారు.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ లార్జర్-ద్యాన్-లైఫ్ యాక్షన్ డ్రామా 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.