సింహాద్రి వెనుక పోసాని సలహా!
Posani Krishna Murali Reveals Jr NTR's Childhood Memories
గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ అత్యద్భుతమైన నటనతో పాటు ఎంతో ఫిట్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఒకప్పుడు బొద్దుగా కనిపించిన తారక్ కెరీర్ ప్రారంభంలో , చిన్నతనంలో తన శరీర ఆకృతి పట్ల ఎంతో ఆందోళన చెందేవారని నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భవిష్యత్తులో ఇంతటి అగ్ర నటుడిగా ఎదుగుతాడని ఎవరూ ఊహించని కాలంలోనే తన రూపంపై తారక్ పడిన సంఘర్షణలను పోసాని గుర్తుచేసుకోవడం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
చిన్న వయసులోనే చలనచిత్ర రంగంలోకి అడుగుపెడుతున్న తరుణంలో తాను కాస్త లావుగా ఉండటం వల్ల ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారా అని ఎన్టీఆర్ ఎంతో మదనపడేవారని పోసాని తెలిపారు. ఆ సమయంలోనే తారక్ కెరీర్‌ను మలుపు తిప్పే ఓ కీలక నిర్ణయం వెనుక పోసాని సలహా కూడా ఉందని పేర్కొన్నారు. ఉదయ్ కుమార్‌తో కాకుండా రాజమౌళి దర్శకత్వంలో `సింహాద్రి` సినిమా చేయాలని తారక్‌కు సూచించగా తారక్ తనపై ఉన్న నమ్మకంతో ఆ సలహాను పాటించారని చెప్పారు. ఆ సినిమా సాధించిన ఘనవిజయం తారక్ కెరీర్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చిందని అప్పటి విషయాలను పోసాని గుర్తు చేసుకున్నారు.
కెరీర్ ఆరంభంలో `రాఖీ` వంటి సినిమాల సమయంలో తన శరీర బరువుపై ఎన్నో విమర్శలు ఎదుర్కున్నా? తారక్ తన నిరంతర కృషి, అంకితభావంతో అసాధ్యమైన రీతిలో బరువు తగ్గి పూర్తి మేకోవర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. చిన్ననాటి అభద్రతాభావాలను, బాహ్య విమర్శలను అధిగమించి నేడు దేశవ్యాప్తంగా ఫిట్‌నెస్‌కు నిదర్శనంగా నిలిచిన తారక్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. ప్రతికూలతలను సైతం కష్టంతో అనుకూలంగా మార్చుకుని ఎదిగిన తీరు తారక్ తిరుగులేని వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది.







































