భారతీయ సినిమా ప్రపంచస్థాయికి ఎదుగుతున్న క్రమంలో ఎగ్జిబిషన్ రంగం కష్టాల్లోకి వెళుతోందనే విశ్లేషణలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఓవైపు పాపులర్ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ తన స్క్రీన్ల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రణాళికలు రచిస్తుంటే, మరోవైపు చిత్రపరిశ్రమ నిపుణులు ఎగ్జిబిషన్ రంగంలో పెను మార్పులు, రాబోవు పరిణామాల గురించి మాట్లాడుతున్న తీరు నిజంగా భయపెడుతోంది.
దీనికి కారణం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలనుకునే ఆడియెన్ శాతం అమాంతం తగ్గుతోంది. ఇంతకుముందులా థియేటర్లకు మాత్రమే వెళ్లాలనే ఆలోచన నేటి జనరేషన్ ప్రేక్షకులకు లేదు. అరచేతిలోనే వైకుంఠం అందుబాటులో ఉంది. మొబైల్ ఫోన్ లో ఓటీటీలు, బుల్లితెర, యూట్యూబ్, డిజిటల్ యాప్‌లలో కావాల్సినంత వినోదం అందుబాటులో ఉంది. పైగా థియేటర్లలో సినిమాని మించి వెరైటీ ఐటమ్ లు ఇక్కడే దొరుకుతున్నాయి. ఓటీటీల్లో చేసినన్ని ప్రయోగాలు థియేట్రికల్ ఆడియెన్ కోసం చేయడం లేదు. ఇలాంటప్పుడు థియేటర్ వరకూ వెళ్లాల్సిన అవసరం ఏం ఉంది? ఒక ఫ్యామిలీ కోసం టికెట్లు, పాప్ కార్న్- కోక్ కోసమే రూ.5000 ఖర్చు చేయాల్సిన కర్మేంటి? అంటూ మధ్యతరగతి జనం ఆలోచిస్తున్నారు. దీని ప్రభావం థియేట్రికల్ రంగంపై పడుతోందనేది ఒక విశ్లేషణ.
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అంతటి వాడు జనాలు ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారని, థియేటర్లకు మించి వినోద సాధనాలు అందుబాటులోకి వచ్చేశాయని అన్నారు. ఒకప్పుడు తాను సినిమా చూడాలంటే కచ్ఛితంగా థియేటర్ తప్ప వేరే ఆప్షన్ లేదు.. కానీ ఇప్పుడలా కాదని అమీర్ విశ్లేషించారు. థియేటర్లకు రావాలని ప్రేక్షకులను నిర్భంధించలేము కదా! అని ఆయన నిర్వేదం వ్యక్తం చేసారు. ఇటీవల ఎగ్జిబిషన్ రంగంలోని పలువురు నిపుణులు థియేటర్ల స్థానంలో గేమ్స్ జోన్, ఇతర ఆటలకు సంబంధించిన వినోదాలను రీప్లేస్ చేసేందుకు ఆలోచిస్తున్నారని ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ థియేటర్ల స్థానంలో కళ్యాణమంటపాలు, ఇతర వ్యాపార సముదాయాలు వెలసాయి.
తాజాగా ఓటీటీల డామినేషన్ గురించి నెట్ ఫ్లిక్స్ సీఈవో సరండోస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. జనం థియేటర్లకు వెళ్లే ఆలోచనలో లేరని, ఇంట్లోనే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. భవిష్యత్ అంతా ఓటీటీ రంగానిదేనని ఆయన అన్నారు. ప్రజలకు ఏం కావాలో అది ఓటీటీల్లో అందుబాటులో ఉంది. అలాంటప్పుడు థియేటర్లకు ఎందుకు వెళతారు? అని ఎదురు ప్రశ్నించారు. భారీతనం నిండిన సినిమాల కోసం మాత్రమే జనం థియేటర్ల వరకూ వెళ్లాలనుకుంటున్నారని అన్నారు. దీనిని బట్టి మునుముందు థియేటర్లకు గడ్డు కాలం ఎదురు కాబోతోందని అర్థం చేసుకోవచ్చు.
ఈ పరిస్థితిని అధిగమించటానికి సదరు నిర్మాతలు, హీరోలు ఆలోచించుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఎవ్వరికి వారు పట్టీ పట్టనట్లు వదేలేస్తున్నారు. ఇది పరిశ్రమతో పాటు సినిమా పై జీవించే వారి మనుగడ ప్రశ్నర్ధకంగా మారుతుంది. ఇది ఇక ఎంతో కాలం పట్టదు. ఇప్పటికైనా నిర్మాతలు, హీరోలు మేల్కొని పరిష్టితి చక్కదిద్దుకోవలసిన సమయం ఆసన్నమైనది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నవి. మండు వేసవిలో కూడా జనం రాక ఏసీ థియేటర్లు షోలు పడక మూసుకోవలసిన పరిస్థితి దాపురించింది. సినీ పరిశ్రమ, ప్రభుత్వం కలసి ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనటాని తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. మళ్ళీ థియేటర్లలలో ప్రేక్షకులతో కళకళలాడాలని కోరుకుందాం.
-పర్వతనేని రాంబాబు✍️