నందమూరి నటసింహం బాలకృష్ణ కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించిన విషయం విదితమే. నటుడిగా ఆదిత్య 369, భైరవద్వీపం, సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో - పొంతన లేని పాత్రల్లో నటిస్తూ 50సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న కథానాయకుడు బాలకృష్ణ.
అంతేకాదు తన తల్లి పేరుతో తన తండ్రి స్థాపించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని సమర్ధవంతంగా నడిపిస్తూ, ఎందరికో జీవినదానం కలిపిస్తూ.. అందరి చేత ప్రశంశలు అందుకుంటున్నారు బాలయ్య.
దీనిని మించి అటు సినిమా రంగంలో రాణిస్తూనే, ఇటు సేవా రంగంలో పయనిస్తూనే రాజకీయ రంగంలోకి అడుగిడిన బాలయ్య అక్కడ కూడా తన తడాఖా చూపించారు. వరసగా మూడుసార్లు ఎమ్యెల్యేగా గెలిచారు. ప్రజాప్రతినిధిగా అటు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ, బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా ఇటు సంజీవనిలా నిలబడుతూ, నందమూరి నటసింహంలా సంచలనాలు సృష్టిస్తూ సాగుతున్న నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ జర్నీ కి ఈ పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చింది అనేది అభిమానుల కంప్లైంట్.
అయితే అన్నిటినీ సహృదయంతో స్వీకరించే బాలకృష్ణ సరైన సమయంలోనే ఈ పద్మభూషణ్ వచ్చింది ఎందుకంటే మా నాన్న గారు 100 జయంతి జరుగుతున్న సందర్భంలో నా 50 ఏళ్ళ నటజీవితాన్ని చేరుకున్న దశలో ఇది రావడం దైవ సంకల్పంగా భావిస్తున్నాను అంటూ వినమ్రంగా వ్యాఖ్యానించారు.
ఇక నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డు ని నేటి సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు బాలయ్య. ఎంటైర్ నందమూరి అభిమానులందరూ ఆ మధుర క్షణాలను వీక్షించేందుకు వేచి చూస్తున్నారు. తెరపై డైలాగ్స్ పలకడంలో తిరుగులేని బాలకృష్ణ ను ఇకపై పద్మభూషణ్ బాలకృష్ణ గా పిలుచుకోవడానికి ఉవ్విళూరుతున్నారు.