స్మార్ట్ యుగంలో ప్రజలు థియేటర్ల వరకూ వచ్చే పరిస్థితి లేదు. సినిమాలో చాలా పెద్ద మ్యాటర్ ఉందన్న టాక్ వస్తే తప్ప జనం థియేటర్లకు రావడం లేదు. ఓటీటీలు, డిజిటల్ యాప్ ల డామినేషన్ కారణంగా సినిమా హాళ్లు సంకటంలో పడ్డాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారీ సినిమాలు తప్ప సాధారణ సినిమాల కోసం జనం థియేటర్ల వైపు వచ్చే సీన్ లేదు.
కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు నాని `హిట్ 3` కోసం టికెట్ ధరల్ని పెంచడం విమర్శలకు తావిస్తోంది. త్వరలో విడుదల కానున్న హిట్ 3 టికెట్ హైక్ పై నెటిజనులు గుర్రుమీదున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాని సినిమా కోసం టికెట్ పెంపునకు అనుమతించింది. ప్రతి టికెట్‌పై సింగిల్ స్క్రీన్‌లకు రూ. 50 .. మల్టీప్లెక్స్ థియేటర్లకు రూ. 75 టికెట్ల పెంపుకు ఓకే చేసింది. అయితే రూ. 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి టిక్కెట్ల పెంపు సామాన్య, మధ్య తరగతి ప్రజల్ని భయపెడుతోంది. ``ఇది చాలా అత్యాశ.. ఇదేమీ బాహుబలి కాదు కదా!`` అని అందరూ విస్మయం చెందుతున్నారు. సినీ ప్రియులలో ఒక వర్గం ఈ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారు. కొందరు ఇది చెత్త నిర్ణయం అని విమర్శిస్తున్నారు.
సోషల్ మీడియాల్లో `హిట్ 3` బృందాన్ని ట్రోల్ చేస్తూ పలువురు తీవ్రమైన కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. నేటి అధిక ధరల క్రైసిస్ లో ఒక ఫ్యామిలీ థియేటర్ కి వచ్చి సినిమా చూడాలంటే మినిమంగా రూ.3000 ఖర్చవుతోంది. సామాన్యులకు ఇది పెనుభారంగా మారడంతో వినోదం ఆప్షన్ లేకుండా పోతోంది. టికెట్ ధరల పెంపు విషయంలో నిర్మాతలు జాగ్రత్తగా ఆలోచించాలని కోరుతున్నారు.