జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఒక ప్రముఖ తెలుగు నిర్మాత జాతీయ అవార్డుల్లోను లాబీయింగ్ చేసారట. ఈ విషయాన్ని చెప్పింది మరెవరో కాదు.. ప్రముఖ హిందీ నటుడు, జాతీయ అవార్డ్ గ్రహీత పరేష్ రావల్. అతడు నటించిన `సర్ధార్` చిత్రం 90లలో జాతీయ అవార్డుల కోసం పోటీపడినా, పురస్కారం వేరే సినిమాకి వెళ్లింది. దాని వెనక లాబీయింగ్ పని చేసిందని, ఓటింగ్ విధానాన్ని ప్రభావితం చేసేందుకు జాతీయ అవార్డుల్లోను లాబీ నడుస్తుందని పరేష్ బహిరంగంగా తెలిపారు.
తాజా ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. తన సినిమా సర్ధార్ మొదటి నుంచి పోటీలో ఉన్నా కానీ, చివరికి మహేష్ భట్ తెరకెక్కించిన `సర్` చిత్రానికి జాతీయ అవార్డు దక్కిందని తెలిపారు. ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, పూజా భట్ తదితరులు కీలక పాత్రల్లో నటించాడు. ఒక సినిమా కోసం తాము లాబీయింగ్ నడిపించామని అప్పట్లో తెలుగు నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి తనతో అన్నారని కూడా పరేష్ రావల్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవార్డు కావాలంటే లాబీయింగ్ చేయడం నేర్చుకోవాలని తనతో సుబ్బరామిరెడ్డి అన్నారట.
టీఎస్సార్ గా సుప్రసిద్ధుడైన సుబ్బరామిరెడ్డి టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా కొనసాగారు. టిఎస్సార్ జాతీయ పురస్కారాలను కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా పలు ఇన్ ఫ్రా కాంట్రాక్టులను టీఎస్సార్ విజయవంతంగా నిర్వహించారు. పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకుడిగాను ఆయన సుపరిచితుడు. టాలీవుడ్ లో దిగ్గజ నటులందరికీ అతడు అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు కూడా.