ఈ ఏడాది భారీ గ్లోబల్ ఈవెంట్ WAVES అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వేడుకకు దిగ్గజ ఫిలింమేకర్స్ సహా తారాతోరణం కొలువు దీరనుంది. ఇలాంటి వేదికపై తమ సినిమాలను ప్రమోట్ చేస్తే దానికి గ్లోబల్ రీచ్ సాధ్యమవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
తాజా సమాచారం మేరకు రణబీర్- నితీష్ ల `రామాయణం` ఫస్ట్ లుక్ పోస్టర్, వీడియో గ్లింప్స్ ని `వేవ్స్ 2025` ఈవెంట్లో రిలీజ్ చేయనున్నారని తెలిసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తారల నడుమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న వేడుక కావడంతో రామాయణం సహా పలు చిత్రాలు ఫస్ట్ లుక్ లు లాంచ్ చేయాలని నిర్మాతలు భారీగా ప్లాన్ చేస్తున్నారు. రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణం తొలి నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దంగల్ ఫేం నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. సీతగా సాయిపల్లవి, హనుమాన్ గా సన్నీడియోల్, రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించి ఈ ఏడాది దీపావళికి మొదటి భాగాన్ని, వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేస్తున్నారు.
ఆసక్తికరంగా ఇదే వేడుకలో పాల్గొంటున్న మెగాస్టార్ చిరంజీవి తన సినిమా `విశ్వంభర`కు ప్రమోషన్ చేసేందుకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ నిరుత్సాహపరచగా, సవరించిన టీజర్ ని వేవ్స్ వేదికగా రిలీజ్ చేస్తే బావుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర పాన్ ఇండియా కేటగిరీలో పలు భాషల్లో విడుదల కానుంది. ముఖ్యంగా తెలుగు- హిందీ మార్కెట్లలో భారీ వసూళ్లు తేవాలనేది ప్లాన్ ఉంది గనుక వేవ్స్ లో ప్రచారం అవసరమని వారంతా భావిస్తున్నారు.
సోషియో ఫాంటసీ కేటగిరీలో రూపొందుతున్న విశ్వంభరకు వేవ్స్ గ్లోబల్ ఈవెంట్లో ప్రచారం కల్పిస్తే అది మార్కెటింగ్ పరంగా మైలేజ్ ని పెంచే వీలుందని అంచనా. రాజమౌళి, రజనీకాంత్, నాగార్జున, దేవరకొండ సహా పలువురు తారలు వేవ్స్ ఈవెంట్లో పాల్గొంటున్నారు. అందువల్ల వారంతా తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకునేందుకు ఆస్కారం లేకపోలేదు. మే 1 నుంచి 4 వరకూ వేవ్స్ ఈవెంట్ ముంబైలో జరగనుంది.