దేశంలో ఎలిజిబుల్ బ్యాచిలర్లకు పెళ్లిళ్లు జరగని పరిస్థితి ఉంది. నేటి ఆధునిక సమాజంలో పెళ్లి కాని ప్రసాదుల వ్యవహారం విస్తుగొలుపుతోంది. లక్షల్లో జీతాలు అందుకుంటున్నా పెళ్లిళ్లు కుదరని పరిస్థితి ఉంది. అయితే దీనిని ఆసరాగా ఉపయోగించుకుని ఆన్ లైన్ మ్యాట్రిమోనియల్ పోర్టల్స్ మోసాలకు తెర తీస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రఖ్యాత షాదీ డాట్ కామ్ లో ఫేక్ ప్రొఫైల్ స్కామ్ పై కోర్టులో విచారణ సాగుతోంది.
నకిలీ మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్‌తో కూడిన ఆన్‌లైన్ చీటింగ్ కేసుకు సంబంధించి షాదీ.కామ్ డైరెక్టర్ అనుపమ్ మిట్టల్, టీమ్ లీడర్ విఘ్నేష్ , మేనేజర్ సతీష్‌లను విచారణను ఎదుర్కోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35(3) కింద కోర్టు నోటీసులు జారీ చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించింది.
హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌కు చెందిన ఒక మహిళా డాక్టర్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. రాజమండ్రికి చెందిన చెరుకూరి హర్ష (మారు పేరు), ఆంధ్రప్రదేశ్‌లోని యానాంకు చెందిన ఒక ఎమ్మెల్యే ఫోటోను ఉపయోగించి షాదీ.కామ్‌లో నకిలీ ప్రొఫైల్‌ను సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. కాబోయే వరుడిగా నటిస్తూ హర్ష తన తల్లి అమెరికాలో నివసిస్తున్న డాక్టర్ అని పేర్కొన్నాడు. కాలక్రమేణా తప్పుడు సాకులతో ఫిర్యాదుదారు(మహిళా డాక్టర్)డి నుండి రూ.11 లక్షలు వసూలు చేసినట్టు ఫిర్యాదు దారు ఆరోపించారు. హర్షను తన డబ్బు తిరిగి అడగ్గా, మహిళా డాక్టర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో ప్రసారం చేస్తానని బెదిరించిందని, అదనంగా రూ. 10 లక్షలు డిమాండ్ చేసాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో షాదీ.కామ్ ప్రతినిధులు ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్ తుకారాంజీ రెండు వైపుల వాదనలను సమీక్షించారు. వాదనలు విన్న తర్వాత, ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలన్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. నిందితులను విచారణ ఎదుర్కోవాలని ఆదేశించింది. మ్యాట్రిమోనీ పోర్టల్‌లో వెరిఫికేషన్ లోపాలను సైబర్ పోలీసులు బయటపెట్టారు. షాదీ డాట్ కామ్ లో నకిలీ ప్రొఫైల్ ద్వారా పెద్ద ఎత్తున ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ స్కామ్ జరిగిందనే ఆరోపణలపై మార్చి 15న జోగడ వంశీ కృష్ణను అరెస్టు చేసిన తర్వాత వెబ్ పోర్టల్ లోని లోపాలను పోలీసులు బట్టబయలు చేసారు. ఎగ్జిక్యూటివ్ లు ఎలాంటి తనిఖీలు లేకుండానే ప్రొఫైల్స్ అప్ డేట్ చేస్తున్నారని తేలింది.