అక్రమ బంగారం రవాణా కేసులో కన్నడ నటి రన్యారావు అరెస్ట్ గత నెలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో నటి రన్యారావును కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. ఈ కేసులో కళ్లు భైర్లు కమ్మే నిజాలెన్నో బయటపడ్డాయి. దుబాయ్ నుంచి భారతదేశానికి పలుమార్లు రన్యారావు, ఆమె సిండికేట్ సభ్యులు అయిన తెలుగు నటుడు కం ఎంటర్ ప్రెన్యూర్ తరుణ్ కొండూరు రాజు, బళ్లారికి చెందిన ఆభరణాల వ్యాపారి సాహిల్ సకారియా జైన్ లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఈ విచారణ అనంతరం కోర్టు తీర్పు మేరకు, విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ మరియు స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ చట్టం (కోఫెపోసా) కింద ఆ ముగ్గురిపైనా కఠినమైన కేసును నమోదు చేసి నిర్బంధించారు.
ఈ కేసులో విచారణ అనంతరం రన్యా రావు అలియాస్ హర్షవర్ధిని రన్యాను బెంగళూరులోని సెంట్రల్ జైలుకు తరలించారు. నిజానికి కాలేజ్ స్నేహితులు అయిన రన్యా, తరుణ్, సాహిల్ దుబాయ్ లో వీరా డైమండ్స్ పేరుతో ఒక కంపెనీని స్థాపించి జెనీవా, థాయ్ లాండ్ నుంచి బంగారం దిగుమతి చేసి భారత్ కు అక్రమ రవాణా చేసారు.
చాలాసార్లు వేరే దేశాలకు వెళుతున్నామని పత్రాలు సృష్టించి భారత్ కు బంగారాన్ని దొంగతనంగా తీసుకుని వచ్చారు. దీని విలువ వందల కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు అంచనా వేసారు. ముగ్గురు స్నేహితులు కలిసి 100 కిలోల బంగారాన్ని భారత్ కి అక్రమంగా తరలించారని కూడా అనుమానించారు. అయితే దిగుమతి సుంకాలను ఎగవేయడంతో స్నేహితుల బండారం బట్టబయలైంది.