సోషల్ మీడియా సంచలనం, ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ టాలీవుడ్ లో ఆరంగేట్రం చేస్తున్నారు. క్రికెటర్ చాహల్ నుంచి విడాకులు తీసుకున్న ధనశ్రీ ప్రస్తుతం నటనా కెరీర్ పై దృష్టి సారించారు. తదుపరి దిల్ రాజు నిర్మించనున్న తెలుగు చిత్రం `ఆకాశం దాటి వస్తావా`తో తన నటనా రంగ ప్రవేశం చేయనున్నారు. నటిగా ధనశ్రీ తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది. నృత్య ప్రధానమైన వినోదాత్మక కథాంశంతో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. శ్రీ శశి కుమార్ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ డ్యాన్స్ బేస్డ్ మూవీలో ధనశ్రీ తన ప్రతిభను ప్రదర్శించనుంది. ఈ చిత్రంలో కొత్త నటీనటులను పరిచయం చేస్తారు. వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
ధనశ్రీ పాపులర్ కొరియోగ్రాపర్. సోషల్ మీడియాల్లో డ్యాన్సింగ్ క్వీన్ గా హృదయాలను గెలుచుకున్నారు. ముంబైకి చెందిన ధనశ్రీ వృత్తిరీత్యా శిక్షణ పొందిన దంతవైద్యురాలు. అయితే తన నిజమైన అభిరుచి ఎప్పుడూ నృత్యమే. ఆమె ప్రఖ్యాత షియామక్ దావర్ వద్ద శిక్షణ పొంది, చివరికి తన సొంత డ్యాన్స్ అకాడమీ `ధనశ్రీ వర్మ కంపెనీ`ని ప్రారంభించింది.
దంతవైద్యం నుండి నృత్యం వరకు ఈ ప్రతిభావని ప్రయాణం స్ఫూర్తిదాయకం. శాస్త్రీయ భారతీయ నృత్యాన్ని సమకాలీన నైపుణ్యంతో సృజనాత్మకంగా ప్రదర్శించడం ధనశ్రీ ప్రత్యేకత. టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ సహకారంతో తొలి అడుగులు వేయడం ప్లస్ కానుంది.