కంగనా రనౌత్ నటించిన `ఎమర్జెన్సీ` బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న కంగనకు ఇప్పుడు మరో లీగల్ చిక్కు వచ్చి పడింది. ఎమర్జెన్సీ ఫ్లాపైనా కొత్త వివాదం తెచ్చి పెట్టింది. ప్రముఖ జర్నలిస్ట్ - రచయిత్రి కూమి కపూర్ కంగనకు చెందిన మణికర్ణికా ఫిల్మ్స్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై దావా వేశారు. కంగనా సినిమా తన పుస్తకం `ది ఎమర్జెన్సీ: ఎ పర్సనల్ హిస్టరీ` ఆధారంగా రూపొందించారని, ఒప్పందాన్ని ఉల్లంఘించి తప్పుగా సన్నివేశాల్ని తెరకెక్కించి తన ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు.
ఎమర్జెన్సీ చారిత్రక దోషాలతో నిండి ఉందని, దీనికి తన పుస్తకం బాధ్యత వహిస్తుందని రచయిత కూమి కపూర్ పేర్కొన్నారు. తన పుస్తకాన్ని వక్రీకరించిన సినిమా తీయడం, నమ్మక ద్రోహానికి దారితీసిందని కూడా బాధను వ్యక్తం చేశారు. కంగనా, ఆమె సోదరుడు ఎమర్జెన్సీ నిర్మాత అక్షత్ రనౌత్‌లకు ఈ నెల ఆరంభంలోనే రచయిత్రి నోటీసులు పంపారు. తాను ఫోన్ చేసినా వారు స్పందించలేదని రచయిత్రి కుమీ ఆరోపించారు. స్క్రిప్టు రచయిత తన పుస్తకాన్ని ఒక్కసారి చదివి ఉంటే తప్పులను సులభంగా నివారించవచ్చు అని కపూర్ వ్యాఖ్యానించారు. కంగన సోదరుడు అక్షత్ తనను 2021లో ముంబైలో కలిసారని, పుస్తకంలో ఒక అధ్యాయాన్ని తమ సినిమా కోసం ఉపయోగించుకునేలా హక్కుల కోసం అడిగారని రచయిత్రి తెలిపారు. మణికర్ణిక ఫిలింస్ పెంగ్విన్ - నాతో కలిపి త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఒప్పందంలో రెండు కీలక నిబంధనలు ఉన్నాయి. కానీ కంగన నిబంధనలు ఉల్లంఘించారు.
పుస్తకాన్ని రాతపూర్వక అనుమతి లేకుండా ప్రమోషన్ లేదా పబ్లిసిటీ కోసం ఉపయోగించరాదని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఫిలింమేకర్ కు కళాత్మక స్వేచ్ఛ ఉన్నా, చారిత్రక వివరాలతో అవి సరిపడకపోతే ఎటువంటి వివరాలను మార్చకూడదు అని రచయిత్రి కపూర్ అన్నారు. `బేస్డ్ ఆన్` అనే పదాన్ని ఉపయోగించవద్దని నేను ప్రత్యేకంగా చెప్పాను.. కానీ వారు అలానే చేశారు! అని కపూర్ ఆరోపించారు. తనకు సినిమా స్క్రిప్ట్ ఎప్పుడూ చూపించలేదని అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాతే ఎమర్జెన్సీ తన పుస్తకాన్ని దాని మూలంగా పేర్కొన్నట్లు గమనించానని ఆమె తెలిపారు. మీడియాలో ప్రేరణ అని మాట్లాడి, నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లో సినిమా చివరిలో బేస్డ్ ఆన్ అని వేసారు. నమ్మకం ఇవ్వడానికి నా పేరును ఉపయోగించారని కూడా తెలిపారు. ఈ చిత్రం కూమి కపూర్ రాసిన `ది ఎమర్జెన్సీ`, జైయంత్ వసంత్ షిండే రాసిన `ప్రియదర్శని` పుస్తకాల నుండి ప్రేరణ పొందింది అని డిస్ క్లెయిమర్ వేసింది నెట్ ఫ్లిక్స్.
కూమి కపూర్ రాసిన `ది ఎమర్జెన్సీ` పుస్తకాన్ని 2015లో పెంగ్విన్ ప్రచురించింది.1975-77 ఎమర్జెన్సీ కాలం గురించి వివరణాత్మక కథనాన్ని అందించింది. నెట్‌ఫ్లిక్స్, మణికర్ణిక ఫిల్మ్స్ ఇంకా లీగల్ నోటీసులకు స్పందించలేదని రచయిత్రి తెలిపారు.