ఏఐ ప్రమాదాలను సృష్టిస్తోందని తెలుసు.. ఉద్యోగాలు తొలగిస్తోందని తెలుసు.. కానీ సినీపరిశ్రమకు ఇలాంటి ముప్పు తెస్తుందని ఏనాడూ అనుకోలేదు. ఏఐ సాంకేతికతతో ఈ డూప్లికేట్ మ్యూజిక్ కథేమిటో కానీ చాలా కంగారు పెడుతోంది. ఏ.ఆర్.రెహమాన్ ఇంతకుముందు రజనీకాంత్ సినిమాలోని ఓ పాట కోసం ఏఐలో ఇద్దరు మరణించిన గాయకుల వాయిస్ లను రీక్రియేట్ చేయడంపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. నైతిక పరమైన అంశాల గురించి ప్రజలు చర్చించారు. చనిపోయిన వారి ఇమేజ్ ని బతికి ఉన్నవారు స్వార్థంతో తమ ధనదాహానికి ఉపయోగించుకోవడం తగునా? అని విమర్శించారు.
అయితే అది చాలా చిన్న పార్ట్ మాత్రమే. ఏఐతో ముప్పు ఇంకా ఎన్ని విధాలుగా ఉండబోతోంది? అంటే.. ఊహించలేని విధంగా ఉంది. మునుముందు ఫేక్ మ్యూజిక్ డైరెక్టర్లు ఈ ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఈ క్రియేటివిటీ అంతా తమదేనని చెప్పుకు తిరిగే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.
డూప్లికేట్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పటికే జీవించి ఉన్న గొప్ప గొప్ప గాయనీగాయకుల వాయిస్ లను ఏఐలో రీక్రియేట్ చేసి ఉపయోగించుకుని పెద్ద గాయకులతో పాడించామని, మా సినిమా బడ్జెట్ ఇంత అంత అని గొప్పలకు పోయి, సినిమాని మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తారని కూడా విశ్లేషిస్తున్నారు. ఇది అందరు మ్యూజిక్ డైరెక్టర్లకు వర్తించదు. కొందరి అనైకత కారణంగా సమస్య ఏర్పడవచ్చు. కొందరు కాపీ క్యాట్ ఫేక్ మ్యూజిక్ డైరెక్టర్లకు ఏఐ బాగా సహకరిస్తుందని ఒక అంచనా.
ఏఐతో ఇలాంటి నైతిక పరమైన చాలా చిక్కులే ఉన్నాయి. రెహమాన్ రజనీ సినిమాలో పాటను క్రియేట్ చేయడానికి మరణించిన గాయకులు పాడిన పాట హక్కుల కోసం వారి కుటుంబీకులకు నిజమైన హక్కుదారుకు కొంత డబ్బు చెల్లించామని చెప్పారు. అది న్యాయబద్ధమైనది. కానీ ఎలాంటి డబ్బును రాయల్టీగా చెల్లించకుండా చనిపోయిన గాయనీగాయకుల స్వరాల్ని ఏఐలో రీక్రియేట్ చేసి డబ్బు చేసుకోవాలనుకునే దుండగులతోనే అసలు ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఏఐ ఉపయోగిస్తే నైతికతను చూడాలని, బాధ్యతగా వ్యవహరించాలని రెహమాన్ హెచ్చరిస్తున్నారు.