షైన్ టామ్ చాకోపై ప్రముఖ మలయాళ నటి విన్సీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అతడు సెట్లో మాదక ద్రవ్యాలు వినియోగించాడని విన్సీ ఫిర్యాదు చేసారు. తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నా కానీ, పోలీసులు టామ్ కు నోటీసులు పంపి అరెస్ట్ చేసారు. అయితే టామ్ చాకో బెయిల్ పై విడుదలయ్యారు.
ఈ మొత్తం ఉదంతంతో ముడిపడిన డ్రగ్స్ వినియోగం గురించి ఇప్పుడు బ్లాక్ బస్టర్ మూవీ `మార్కో` ఫేం, యువహీరో ఉన్ని ముకుందన్ మాట్లాడారు. తొలిగా డ్రగ్స్ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన నటి విన్సీని అతడు సమర్థించారు. అయితే ఈ వ్యవహారంలో సినీపరిశ్రమను సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నారని అతడు అన్నాడు. సినిమా ప్రభావంతో మాదకద్రవ్యాల దుర్వినియోగం, నేరాల రేటు పెరుగుతున్నాయని చెప్పడం సరికాదు! అని ఉన్ని ముకుందన్ కొచ్చిలోని ఒక కార్యక్రమంలో విలేకరులతో అన్నారు. సినిమా ఆ విధంగా సమాజాన్ని ప్రభావితం చేయదని ఆయన పేర్కొన్నారు. అయితే అక్షరాస్యత రేటు చాలా ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం, నేరాల రేటు ఎందుకు పెరుగుతుందో అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఉన్ని ముకుందన్ అన్నారు.
ఇలాంటి నిషిద్ధ పదార్థాలు కేరళకు ఎలా చేరుతాయి? అవి పాఠశాలలకు ఎలా చేరుతున్నాయి? వాటిని సరఫరా చేసేది ఎవరు? నా చిన్నప్పటి నుండి నేను వీటి గురించి వింటున్నాను! అని ఉన్ని అన్నారు. పెరుగుతున్న మాదకద్రవ్యాల ముప్పుపై అధికారులు, పాఠశాలలు, తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.
సినిమా అనేది సాఫ్ట్ టార్గెట్ అని, పెరుగుతున్న మాదకద్రవ్యాల దుర్వినియోగానికి సినిమాను మాత్రమే నిందించలేమని పేర్కొన్న ఉన్ని ముకుందన్ ఈ ముప్పుకు దారి తీసేవారిలో సినీ ప్రముఖుల శాతం తక్కువగా ఉందని, కానీ వారు వినోద పరిశ్రమకు చెందినవారు కాబట్టి ఎక్కువగా దృష్టి పెడుతున్నారని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల ముప్పు ప్రతిచోటా ఉంది.. ఇది అన్ని పరిశ్రమలలో ప్రబలంగా ఉంది! అని ఆయన వ్యాఖ్యానించారు.