సౌత్ లో బంపర్ హిట్టు కొట్టిన క్రైమ్ డ్రామాల్ని హిందీలోకి రీమేక్ చేస్తూ వందల కోట్లు సంపాదిస్తున్నాడు సదరు హిందీ హీరో. సొంత నిర్మాణ సంస్థ అండదండలతో అతడు సౌత్ లో బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ సినిమాల రీమేక్ హక్కులను కొనుగోలు చేసాడు. ఈ ఫ్రాంఛైజీ నుంచి రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అతడి సంపదల్ని పెంచాయి. ఇవి రెండూ క్రైమ్ డ్రామా నేపథ్యంలో ఉత్కంఠ కలిగించే థ్రిల్లర్ చిత్రాలు.
ఇప్పుడు ఇదే ఫ్రాంఛైజీ నుంచి మూడో సినిమా మొదలవుతోంది. ఈ సినిమాని కూడా ఆ హిందీ హీరో రీమేక్ చేస్తాడని అంతా భావించారు. కానీ ఇంతలోనే పెద్ద ఝలక్ తగిలింది. ఈ సౌత్ హీరోకి అమాంతం పెరిగిన పాన్ ఇండియా ఇమేజ్ కారణంగా, ఆ నార్త్ హీరోని లైట్ తీస్కున్నాడు. అతడికి తన హిట్ ఫ్రాంఛైజీ నుంచి మూడో సినిమాని ఇచ్చేందుకు నిరాకరించాడని కథనాలొస్తున్నాయి.
అంతేకాదు తాను నటిస్తున్న ఈ సినిమాని కేవలం మాతృభాషలోనే కాకుండా పాన్ ఇండియాలో రిలీజ్ చేసి సక్సెస్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇటీవల ఓ బంపర్ హిట్ చిత్రంతో ఈ సౌత్ హీరో రేంజ్ అమాంతం మారిపోయింది. దీంతో మొత్తం గేమ్ ప్లాన్ మార్చేసాడు. ఇకపై నార్త్ నుంచి దక్కే వందల కోట్ల వసూళ్లను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు.
ఓవర్ నైట్ సీన్ మారిపోవడం అంటే ఇదేనేమో! ఒకే ఒక్క పాన్ ఇండియా హిట్ అతడి రేంజును అమాంతం పెంచేసింది. ఈ ఎపిసోడ్ లో సౌత్ హీరో - మోహన్ లాల్. అతడి బంపర్ హిట్ ఫ్రాంఛైజీ `దృశ్యం` సిరీస్ లో రెండు సినిమాలను రీమేక్ చేసిన హిందీ హీరో అజయ్ దేవగన్ వందల కోట్లు వెనకేసుకున్నాడు. కానీ ఇప్పుడు మూడో సినిమా రీమేక్ హక్కులు అతడికి దక్కవని తెలుస్తోంది. `ఎల్ 2 ఎంపూరన్` పాన్ ఇండియా విజయం సాధించడంతో లాల్ ప్లానింగ్ ఇప్పుడు మారిపోయింది.