కొద్దిరోజుల క్రితం మాలీవుడ్ లో దారుణ పరిస్థితులపై కేరళ ప్రభుత్వం నియమించిన `జస్టిస్ హేమ కమిటీ` సంచలన నివేదికను బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. పని ప్రదేశంలో మహిళలకు రక్షణ లేదని, సరైన వసతులు కల్పించలేదని కూడా ఈ నివేదిక వెల్లడించింది. అంతేకాదు.. చాలా దూరం ప్రయాణించి ఒంటరి ప్రదేశాలలో మహిళలు షూటింగులు చేయడం ప్రమాదకరంగా మారిందని కూడా నివేదించింది.
అదే సమయంలో హేమ కమిటీ మాలీవుడ్ లో మాదక ద్రవ్యాల వినియోగం గురించి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల అత్యాచార ఘటనలు పునరావృతం అయ్యే ముప్పును పసిగట్టింది. ఆ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమ కీలక విభాగం అయిన `అమ్మా`, ఫిలింఛాంబర్ వెంటనే కొన్ని చర్యలు చేపట్టాయి. క్రమశిక్షణా కమిటీ పేరుతో ఇలాంటి నేరాలపై శోధించి శిక్షించేందుకు అంతర్గత కమిటీని వేయడంతో ఇక అంతా సద్ధుమణిగినట్టే అనుకున్నారు.
కానీ చాప కింద నీరులా మాలీవుడ్ ని డ్రగ్స్ వదిలిపెట్టడం లేదు. దీనికి షైన్ టామ్ చాకో లాంటి చిన్న నటులు కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనని కేరళ ప్రముఖ మీడియాలు కథనాలు వెలువరించాయి. టామ్, శ్రీనాథ్ బాసి లాంటి చిన్న నటుల పేర్లు మాత్రమే బయటికి వచ్చాయి. విచారిస్తే తిమింగళాలు బయటపడతాయి అని మింట్ కథనంలో పేర్కొనడం సంచలనమైంది. పరిశ్రమలో డ్రగ్స్ గురించి తెలిసినా ఎవరూ పట్టించుకోలేదని, ప్రభుత్వాలు బాధ్యత వహించలేదని కూడా ఈ కథనంలో రచయిత ఆరోపించారు. ప్రమాదకర హాష్, గాంజా, ఎల్.ఎస్.డి వంటి వాటిని పరిశ్రమలో వినియోగిస్తున్నారని కూడా ఈ కథనం వెల్లడించింది.