ప్రపంచంలోనే ఇప్పటివరకూ నంబర్ -1 కామెడీ ఆర్టిస్ట్ ఎవరు? భాష, యాస, దేశం, రాష్ట్రం, ప్రాంతం, కులం, మతం ఇలాంటి అవకరాలతో పని లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించిన హాస్య నటుడిని నంబర్ వన్ అని కీర్తించవచ్చు. అలాంటి ఒకే ఒక్క లెజెండరీ కమెడియన్ - చార్లీ చాప్లిన్.
చాప్లిన్ కి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. హాస్య నటుడు, దర్శకనిర్మాత, స్వరకర్త.. ఇలా సినిమాకి అన్ని విభాగాల్లో పని చేసిన ప్రతిభావంతుడు. ఆల్ రౌండర్ నైపుణ్యంతో ఆకట్టుకున్న గొప్ప కళాకారుడు ఆయన. తన ఐకానిక్ `లిటిల్ ట్రాంప్` పాత్రతో అతడు వరల్డ్ వైడ్ కోట్లాదిగా అభిమానులను సంపాదించాడు. 16 ఏప్రిల్ 1889న ఇంగ్లాండ్‌లోని లండన్‌లో జన్మించిన ఆయన నిశ్శబ్ద చలనచిత్ర యుగం(మూకీ కాలం)లో గొప్ప కీర్తిని, గౌరవాన్ని అందుకున్నారు. సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా చాప్లిన్ ఘనుతికెక్కారు.
చాప్లిన్ కెరీర్ 75 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉంది. ది కిడ్ (1921), సిటీ లైట్స్ (1931), మోడరన్ టైమ్స్ (1936), ది గ్రేట్ డిక్టేటర్ (1940) వంటి క్లాసిక్ చిత్రాలకు దర్శకత్వం వహించి వాటిలో ఆయన ప్రధాన పాత్రలో నటించారు. ఆయన సినిమాలు స్లాప్ స్టిక్ కామెడీని లోతైన సామాజిక, రాజకీయ ఇతివృత్తాలతో కలిపి కథను ప్రభావవంతంగా చెప్పడంలో అతడిని మార్గదర్శకుడిగా నిలిపాయి.
గొప్ప విజయాలు సాధించినా కానీ చాప్లిన్ వివాదాలను ఎదుర్కొన్నాడు. వాటిలో కమ్యూనిస్ట్ సానుభూతి ఆరోపణలు ఉన్నాయి. 1952లో అతడిని అమెరికా నుంచి బహిష్కరించారు. అతడు తన చివరి సంవత్సరాలను స్విట్జర్లాండ్‌లో గడిపాడు. అక్కడ 25 డిసెంబర్ 1977న 88 సంవత్సరాల వయసులో మరణించాడు.
నేడు చాప్లిన్ ఒక సాంస్కృతిక చిహ్నంగా ప్రజల హృదయాలలో మిగిలిపోయాడు. అతడి నటనా శైలి, కాలాతీత హాస్యం ప్రజల హృదయాల్లో బలమైన ముద్రను వేసాయి. మనుషుల స్వభావంపై డెప్త్ ఉన్న చాలా విషయాలను అతడు తెరపై తన అభినయంతో ప్రదర్శించాడు. ముఖ్యంగా మన హాస్య బ్రహ్మీకి చాప్లిన్ పెద్ద స్ఫూర్తి. నేటి జెన్ జెడ్ తరం కచ్ఛితంగా తెలుసుకోవాల్సిన హాస్య నటుడు ఎవరైనా ఉన్నారా ? అంటే అది కచ్ఛితంగా చాప్లిన్.